‘‘నా కెరీర్‌లో చేసిన మోస్ట్ ఇన్ స్పైరింగ్ ఫిల్మ్ ‘పెద్ది’. ఇలాంటి చిత్రాలు దశాబ్దంలో ఒకసారి మాత్రమే వస్తాయి. ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ లాంటి సినిమాలు తరచుగా రావు. అవి రావాలంటే సంవత్సరాలు పడుతుంది. ‘పెద్ది’ కూడా అలాంటి అరుదైన సినిమా. నా లైబ్రరీలో ఎప్పటికీ దాచుకునే మూవీ ఇది’’ అని హీరో రామ్‌చరణ్ తెలిపారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌చరణ్, జాన్వీకపూర్ జోడీగా నటించిన చిత్రం ‘పెద్ది’. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ మూవీ జూన్ 4న విడుదలకానుంది.
సోమవారం ముంబైలో జరిగిన ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో బుచ్చిబాబు సానా మాట్లాడుతూ– ‘‘నా రెండో సినిమాకే ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన రామ్ చరణ్‌గారికి రుణపడి ఉంటాను’’ అన్నారు ‘‘మా అమ్మగారు(శ్రీదేవి), చిరంజీవిగారు కలిసి నటించిన సినిమాలపై ప్రేక్షకులు ఎంతో ప్రేమ చూపించారు. చరణ్‌గారు–నా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ నాకు చాలా ప్రత్యేకం’’ అని జాన్వీ కపూర్ చెప్పారు.
‘‘నేరుగా తెలుగు సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ‘పెద్ది’ రూపంలో ఆ అవకాశం వచ్చింది’’ అన్నారు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఈ వేడుకలో నిర్మాత సతీష్ కిలారు, నటుడు దివ్యేందు శర్మ, కెమెరామెన్ రత్నవేలు మాట్లాడారు.


