మనీలా: తైవాన్ చుట్టూ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా నుండి తైవాన్‌పై ఏ చిన్న దాడి జరిగినా, భౌగోళికంగా సమీపాన ఉన్న కారణంగా ఫిలిప్పీన్స్ అనివార్యంగా యుద్ధంలోకి ప్రవేశిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ యుద్ధమే వస్తే, భౌగోళికంగా తమ దేశం అందులో భాగస్వామ్యం వహించక తప్పదంటూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు డ్రాగన్ కంట్రీ చైనాకు తీవ్ర ఆగ్రహం తెప్పించే అవకాశం ఉంది.
సైనిక ఘర్షణ మొదలైతే..
తైవాన్ విషయంలో తమకు వేరే ప్రత్యామ్నాయం లేదని జపనీస్ మీడియాకు మార్కోస్ స్పష్టం చేశారు. తైవాన్ తమకు చాలా దగ్గరగా ఉండటమే కాకుండా, దాదాపు 2,00,000 మంది ఫిలిప్పీన్స్ పౌరులు అక్కడ నివసిస్తూ, పనిచేస్తున్నారని ఆయన గుర్తుచేశారు. ఒకవేళ నిజంగానే సైనిక ఘర్షణ మొదలైతే ఉత్తర ఫిలిప్పీన్స్ ఆ యుద్ధ ప్రభావానికి తీవ్రంగా గురవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధంలోకి వెళ్లడం తమకు ఇష్టం లేకపోయినా, భౌగోళిక పరిస్థితులు తమను బలవంతంగా లాగుతాయని తెలిపారు.
జపాన్‌తో చేతులు కలుపుతూ..
ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే వారం మార్కోస్ జపాన్‌లో పర్యటించనున్నారు. జపాన్ ప్రధాన మంత్రి సనే తకైచితో సమావేశమై భద్రతా సహకారంపై కీలక చర్చలు జరపనున్నారు. టోక్యో ఇటీవల రక్షణ ఎగుమతుల నిబంధనలను సడలించిన క్రమంలో, జపాన్ భద్రతా విధానంపై మరింత స్పష్టత వస్తుందని మార్కోస్ తెలిపారు. తూర్పు చైనా సముద్రంలో బీజింగ్ నుండి జపాన్, ఫిలిప్పీన్స్ ఎదుర్కొంటున్న బెదిరింపులు, సవాళ్లు ఒకటేనని ఆయన పేర్కొన్నారు. జపాన్ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటనేది తెలుసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు.
చైనాతో దౌత్యం.. ట్రంప్, జిన్‌పింగ్ మంతనాలు
దక్షిణ చైనా సముద్రంపై బీజింగ్‌తో ప్రాదేశిక వివాదం ఉన్నప్పటికీ, శాంతిని నెలకొల్పేందుకు చైనాతో ఉన్నత స్థాయి సంప్రదింపులు జరుపుతున్నట్లు మార్కోస్ ప్రకటించారు. మరోవైపు గత వారం బీజింగ్‌లో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తైవాన్ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటే తీవ్ర ఘర్షణలకు దారితీస్తుందని జిన్‌పింగ్ హెచ్చరించినట్లు ట్రంప్ స్వయంగా తెలిపారు.
ఇది కూడా చదవండి: ఆర్జీ కర్ కేసు: సందీప్ ఘోష్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి


