గాజా ఫ్లోటిల్లా ఘటనపై ప్రపంచ దేశాలు భగ్గుమంటున్నాయి. గాజాకు మానవతా సాయం అందించేందుకు వెళ్తున్న బృందాన్ని అడ్డుకున్న ఇజ్రాయెల్ భద్రతా సిబ్బంది వాళ్ల పట్ల అమానుషంగా ప్రవర్తించింది. ఇందుకు సంబంధించిన వీడియోను స్వయంగా ఇజ్రాయెల్ నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ ఇటామర్ బెన్-గ్విర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ దుమారం మొదలైంది.
సుమారు 40 దేశాల నుంచి 50 ఫ్లోటిల్లా(చిన్నపాటి నౌకలు)ల్లో గాజాకు సాయం అందించేందుకు బయల్దేరాయి. అయితే వాటిని అడ్డుకుని మరీ ఇజ్రాయెల్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తలను నేలపై మోకాళ్లపై కూర్చోబెట్టి, చేతులు వెనుకకు కట్టి ఉంచారు. ఆ సమయంలో ఒక మహిళ "ఫ్రీ, ఫ్రీ పాలస్తీన్" అని నినదించగా, పోలీసులు ఆమెను బలవంతంగా నేలపై తోసిన దృశ్యాలు కనిపించాయి. మే 20న ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆ వీడియోను షేర్ చేసిన బెన్-గ్విర్ ఆ కార్యకర్తలను ఎగతాళి చేస్తూ, "వీరంతా హీరోలుగా వచ్చారు.. ఇప్పుడు చూడండి వీరి పరిస్థితి" అని వ్యాఖ్యానించారు. వాళ్లను ఇజ్రాయెల్ నెగెవ్ ఎడారిలోని కెట్జియోట్ జైలుకు తరలించే అవకాశం ఉందని సమాచారం. అయితే..
ככה אנחנו מקבלים את תומכי הטרור
Welcome to Israel 🇮🇱 pic.twitter.com/7Hf8cAg7fC— איתמר בן גביר (@itamarbengvir) May 20, 2026
ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ప్రతిస్పందనకు దారితీసింది. ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్‌ను ఒక సాధారణ భద్రతా చర్యగా చెబుతున్నప్పటికీ.. పెద్ద దౌత్య సంక్షోభంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఫ్రాన్స్, కెనడా, స్పెయిన్, పోర్చుగల్, నెదర్లాండ్స్ వంటి దేశాలు ఇజ్రాయెల్ రాయబారులను పిలిపించి సమన్లు జారీ చేసి నిరసన వ్యక్తం చేశాయి. ఈ ఘటనపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీవ్రంగా స్పందించారు. అందులో ఇటలీ పౌరులు కూడా ఉన్నారని.. వాళ్లను అవమానకర పరిస్థితుల్లో ఉంచడం ఎంతమాత్రం అంగీకరించలేనిదని అన్నారు. తక్షణమే ఇజ్రాయెల్ క్షమాపణలు చెప్పాలని.. నిర్బంధిత ఇటాలియన్ పౌరులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ జలాల్లో పౌరులను అరెస్టు చేయడానికి ఇజ్రాయెల్‌కు ఏ హక్కు ఉందని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మియంగ్ ప్రశ్నిస్తున్నారు. టర్కీ కూడా తమ పౌరుల విడుదల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది.
ఇటు.. ఈ వీడియో ఇజ్రాయెల్ కేబినెట్‌లోనే చిచ్చు రాజేసింది. బెన్-గ్విర్ చర్యలు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని విదేశాంగ మంత్రి గిదియోన్ సర్ విమర్శించారు. ప్రధాని బెంజమిన్ నేతన్యాహు కూడా ఫ్లోటిల్లాను అడ్డుకోవడం ఇజ్రాయెల్ హక్కు అని చెప్పినా, వీడియోలో కనిపించిన ప్రవర్తన "ఇజ్రాయెల్ విలువలకు విరుద్ధం" అని వ్యాఖ్యానించారు.
ఈ ఘటనతో మరోసారి గాజాలోని మానవతా సంక్షోభం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. యుద్ధం కారణంగా ఎక్కువ మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి శిబిరాల్లో, తాత్కాలిక ఆశ్రయాల్లో జీవిస్తున్నారు. సహాయక సంస్థలు అందిస్తున్న సరఫరాలు అవసరాలకు సరిపోవడం లేదని చెబుతున్నాయి. ఇజ్రాయెల్ మాత్రం తాము సహాయం అడ్డుకోవడం లేదని, సరఫరాలు పర్యవేక్షణలో గాజాకు చేరుతున్నాయని వాదిస్తోంది. అయితే తాజా ఫ్లోటిల్లా ఘటనతో ఇజ్రాయెల్ ముసుగు తొలగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


