ఇరాన్‌ సంచలన నిర్ణయం | Iran War: Is Hormuz cables new flashpoint | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ సంచలన నిర్ణయం

May 18 2026 8:42 AM | Updated on May 18 2026 9:09 AM

Iran War: Is Hormuz cables new flashpoint

పశ్చిమాసియా యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కీలకమైన వాణిజ్య మార్గం హర్ముజ్‌ మూసివేతతో పలు దేశాలు సంక్షోభాలతో అల్లలాడిపోతున్నాయి. ఇరాన్‌కు మరో ఆ‍ప్షన్‌ లేదని.. చర్చలకు దిగి రావాల్సిందేనని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ లాస్ట్‌ అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఈ సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందో అనే ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఇరాన్‌ మరో కీలక బలహీనతపై దృష్టి సారించింది.. 

హర్ముజ్‌ జలసంధి కిందుగా సాగుతున్న అంతర్జాతీయ డిజిటల్‌ కనెక్టివిటీ మార్గాలు.. ఈ యుద్ధంలో కొత్త ఉద్రిక్తతలకు దారి తీసేలా కనిపిస్తున్నాయి. టెహ్రాన్‌ వర్గాలు తాజాగా ప్రకటించిన ప్రణాళికనే ఇందుకు కారణం. దీని ప్రకారం.. హర్ముజ్‌ కింద నుంచి వెళ్తున్న అండర్‌ మైన్‌ సీ కేబుల్స్‌కుగానూ ఫీజులు వసూలు చేయాలని ఇరాన్‌ బలంగా భావిస్తోందట!. 

‘‘జలసంధి గూండా పలు నెట్‌వర్క్‌ కేబుల్స్‌ వెళ్తున్నాయి. అయితే.. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా, అమెజాన్‌ వంటి అంతర్జాతీయ టెక్‌ దిగ్గజాలు ఈ మార్గాల వినియోగానికి ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. సహకరించకపోతే డేటా ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడవచ్చు’’ అని ఇరాన్‌ హెచ్చరించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాదు.. కేబుళ్ల మరమ్మత్తులు, నిర్వహణ హక్కులు కూడా ఇరాన్‌ కంపెనీలకే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్లు ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ అనుబంధ మీడియా ఒకటి కథనం ప్రచురించింది. దీంతో ఇరాన్‌ మూమాలు బ్లాక్‌మెయిలింగ్‌కు దిగడం లేదన్న చర్చ జోరందుకుంది.

అదే గనుక జరిగితే..
ప్రపంచ ఇంటర్నెట్‌, డేటా ట్రాఫిక్‌లో 95% పైగా ఈ సముద్రపు మార్గాల ద్వారానే జరుగుతుంది. హర్ముజ్‌ జలసంధి గుండా అనేక అంతర్జాతీయ కనెక్టివిటీ మార్గాలు వెళ్తాయి. భద్రతా కారణాల వల్ల ఎక్కువ భాగం ఒమన్‌ వైపు ఉన్నప్పటికీ.. ఫాల్కన్‌, గల్ఫ్‌ బ్రిడ్జి ఇంటర్నేషనల్‌ అనే రెండు ప్రధాన మార్గాలు మాత్రం ఇరాన్‌ జలప్రాంతాల గుండా సాగుతున్నాయి. వీటికి నష్టం కలిగితే బ్యాంకింగ్‌ వ్యవస్థలు, ఆర్థిక మార్కెట్లు, సైనిక కమ్యూనికేషన్లు, కృత్రిమ మేధస్సు, అంతర్జాతీయ లావాదేవీలు అన్నీ ప్రభావితమవుతాయి. 

ఇరాన్‌ అండర్‌ సీ మైన్‌ కేబుల్స్‌పై దృష్టి పెడితే.. ఇరాన్‌ పొరుగు దేశాలు, భారత్‌, తూర్పు ఆఫ్రికా, యూరప్–ఆసియా మధ్య ఆర్థిక లావాదేవీలు అన్నీ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. సింగపూర్‌ వంటి ఆసియా డేటా హబ్‌ల నుంచి యూరప్‌ వరకు కనెక్టివిటీ దెబ్బతింటే, ఫైనాన్షియల్‌ ట్రేడింగ్‌, బ్యాంకింగ్‌ ట్రాన్స్‌ఫర్లు, క్రాస్‌-బోర్డర్‌ పేమెంట్లు అన్నీ ఆలస్యమవుతాయి. ప్రత్యామ్నాయ మార్గాలున్నా, పెద్ద స్థాయి అంతరాయం అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది. ఒకవేళ ఏదైనా డ్యామేజ్‌ జరిగినా మరమ్మత్తులు కూడా సవాలే. ఎందుకంటే రిపేర్‌ షిప్‌లు ఒకేచోట నిలిచి పని చేయాలి. ఆ సమయంలో ఇరాన్‌ అడ్డుకుంటే అది అసాధ్యం కాదు..

నిజానికి.. 
యుద్ధ ప్రారంభ సమయంలోనే అండర్‌ సీ కేబుల్స్‌ అంశం తెర మీదకు వచ్చింది. వీటిని కత్తిరించడం ద్వారా ఇరాన్‌ ‘డిజిటల్‌ వార్‌’ జరపొచ్చనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ సమయంలో ఇరాన్‌ వాటిని కొట్టిపారేసింది. ఇప్పుడు జలసంధిలో నౌకల నుంచి మాత్రమే కాదు.. ఈ కేబుల్స్‌పైనా ఫీజులు వసూలు చేసే యోచన చేస్తుండడం గమనార్హం. 

అంతర్జాతీయ చట్టం
ఇరాన్‌ మీడియా ప్రకారం, 1982లోని ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టం (UNCLOS) ప్రకారం తీరరాష్ట్రాలకు తమ జలప్రాంతాల్లో కనెక్టివిటీ మార్గాలపై షరతులు విధించే హక్కు ఉంది. ఇరాన్‌ ఆ ఒప్పందంపై సంతకం చేసినా.. ఇంకా ఆమోదించలేదు. సుయాజ్‌ కాలువలో ఈజిప్ట్‌ వసూలు చేసే ఫీజులను ఉదాహరణగా చూపుతున్నా.. హోర్ముజ్‌ సహజ జలసంధి కావడం వల్ల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అయితే.. చమురు తర్వాత ఇప్పుడు డేటా కూడా ఇరాన్‌ చేతిలో బందీ అవుతుందా? అనే ఆందోళన అంతర్జాతీయంగా పెరుగుతోంది. హర్ముజ్‌ జలసంధి కింద ఉన్న ఈ మార్గాలు కత్తిరించబడినా? లేదంటే పన్నులు విధించబడినా.. ప్రపంచ డిజిటల్‌ కనెక్టివిటీకి ఇది మరో పెద్ద దెబ్బ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement