గోథెన్‌బర్గ్‌లో తనకు స్వాగతం పలికిన కళాకారులతో ప్రధాని మోదీ. చిత్రంలో స్వీడన్ ప్రధాని ఉల్ఫ్
కీలక రంగాల్లో పరస్పరం సహకరించుకుందాం
భారత ప్రధాని మోదీ, స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్స్‌సన్ నిర్ణయం
బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయం
గోథెన్‌బర్గ్: సహకారమే మన బలమని భారత ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మోదీ ఆదివారం స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్స్‌సన్‌తో సమావేశమ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని ఈ సందర్భంగా ఇరుదేశాలు అంగీకరించాయి. భారత్–ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం స్ఫూర్తితో తమ ప్రజల ప్రయోజనం కోసం కొత్త అవకాశాలను అన్వేషించాలని నిర్ణయించారు.
వ్యాపారం, వాణిజ్యం, టెక్నాలజీ, రక్షణ సహా కీలక రంగాల్లో పరస్పర సహకారంపై సంప్రదింపులు జరిపారు. సహకారమే మన బలమని ఉద్ఘాటించారు. రెండో రోజుల పర్యటన నిమిత్తం నెదర్లాండ్స్ నుంచి ఆదివారం ఉదయం స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌కు చేరుకున్న మోదీకి ఘనస్వాగతం లభించింది. మోదీ గౌరవార్థం ఆయన ప్రయాణించిన విమానానికి స్వీడన్ ఎయిర్‌పోర్స్ విమానాలు ఎస్కార్ట్‌గా వచ్చాయి.
గోథెన్‌బర్గ్ ఎయిర్‌పోర్టులో మోదీకి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్స్‌సన్ సాదర స్వాగతం పలికారు. మోదీకి స్వాగతం పలకడానికి స్వీడన్‌లోని ప్రవాస భారతీయులు తరలివచ్చారు. మోదీ రాకను పురస్కరించుకొని నిర్వహించిన సంగీత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం మోదీ, క్రిస్టర్స్‌సన్ మధ్య ప్రతినిధుల స్థాయి భేటీ జరిగింది. ఇరు పక్షాలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు.
ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి అందుబాటులో ఉన్న నూతన మార్గాలపై చర్చించారు. హరిత పరివర్తన, కృత్రిమ మేధ(ఏఐ), వర్ధమాన సాంకేతికతలు, స్టార్టప్‌లు, సప్లై చైన్లు, రక్షణ, అంతరిక్షం, వాతావరణ చర్యలు సహా ప్రజల మధ్య సంబంధాల విషయంలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై భారత్, నెదర్లాండ్స్ ప్రత్యేకంగా దృష్టి సారించాయి.
ప్రధాని మోదీకి ‘పోలార్ స్టార్’ గౌరవం
ప్రధాని మోదీ స్వీడన్ అత్యున్నత పురస్కారం ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్, డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్’అందుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చేసిన కృషి, దూరదృష్టి కలిగిన నాయకత్వానికి గుర్తింపుగా ఈ పురస్కారం అందజేసినట్లు స్వీడన్ యువరాణి విక్టోరియా ప్రకటించారని విదేశాంగ శాఖ తెలిపింది.
భారత్, నెదర్లాండ్స్ మధ్య ఇక వ్యూహాత్మక భాగస్వామ్యం
ద హేగ్: అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో భారత్, నెదర్లాండ్స్ దేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లాయి. ఇకపై ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నెదర్లాండ్స్‌లో పర్యటించారు. ఆ దేశ ప్రధానమంత్రి రోబ్ జెటెన్‌తో సమావేశమయ్యారు. ఇరుదేశాలు మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా రక్షణ, అరుదైన ఖనిజాలు సహా కీలక రంగాల్లో పరస్పర సహకారం కోసం 17 ఒప్పందాలపై భారత్, నెదర్లాండ్స్ సంతకాలు చేశాయి. పశ్చిమాసియా పరిణామాలపై ఇద్దరు ప్రధానమంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధన సరఫరాలో అంతరాయాల వల్ల ప్రపంచదేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు. భేటీ తర్వాత వారిద్దరూ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.

మోదీకి రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ పురస్కారాన్ని అందజేస్తున్న స్వీడన్ యువరాణి విక్టోరియా


