అమెరికాపై చైనా, రష్యా కన్నెర్ర | China and Russia are fighting against us | Sakshi
Sakshi News home page

అమెరికాపై చైనా, రష్యా కన్నెర్ర

May 21 2026 5:34 AM | Updated on May 21 2026 5:34 AM

China and Russia are fighting against us

ఇరాన్‌పై దండెత్తడాన్ని తప్పుబట్టిన జిన్‌పింగ్, పుతిన్‌

హార్మూజ్‌ను దిగ్బంధించిన ఇరాన్‌ వైఖరిపై అసంతృప్తి

ట్రంప్‌ ప్రతిపాదిత గోల్డెన్‌ డోమ్‌ ప్రాజెక్ట్‌పైనా విమర్శలు

బీజింగ్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చలు జరిపిన కొద్దిగంటలకే బీజింగ్‌ వేదికగా సమావేశమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు ముక్తకంఠంతో పశ్చిమాసియా యుద్ధాన్ని తప్పుబట్టారు. ఇరాన్‌పై దండెత్తిన అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్దకాంక్షను ముక్తకంఠంతో ఖండించారు. బాధిత ఇరాన్‌కు మద్దతుగా నిలుస్తూనే అంతర్జాతీయ చమురు సంక్షోభానికి పరోక్షంగా కారణమైన ఇరాన్‌నూ పుతిన్, జిన్‌పింగ్‌ తప్పుబట్టారు. 

ఏకపక్షంగా హార్మూజ్‌ను దిగ్బంధించిన అమెరికాతోపాటు సముద్ర మందుపాతరలు పెట్టి ముడిచమురు నౌకల రాకపోకలను స్తంభింపజేసిన ఇరాన్‌పై ఇరుదేశాధినేతలు మండిపడ్డారు. ఈ రెండు దేశాల మొండివైఖరితో ఇంధన సంక్షోభం తలెత్తిందని, ధరలు పెరుగుతున్నాయని ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. బీజింగ్‌లోని ‘గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ పీపుల్‌’లో సంయుక్త ప్రకటనలో పలు అంశాలను పుతిన్, జిన్‌పింగ్‌ ప్రస్తావించారు. 

‘‘ఇరాన్‌పై దండెత్తి అమెరికా, ఇజ్రాయెల్‌ పశ్చిమాసియాలో అస్థిరతకు మరింత ఆజ్యంపోశారు. ట్రంప్‌ ప్రతిపాదిత గోల్డెన్‌డోమ్‌ షీల్డ్‌ రక్షణ ప్రణాళిక అంతర్జాతీయ భద్రతపై దుష్ప్రభావం చూపుతుంది. ఇకనైనా పశ్చిమాసియాలో శత్రుత్వం సమసిపోయి శాంతిస్థాపన జరగాలి’’ అని సంయుక్త ప్రకటనలో పుతిన్, జిన్‌పింగ్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. అంతకుముందు జిన్‌పింగ్‌ మాట్లాడారు. 

చైనా, రష్యాల మధ్య హద్దుల్లేని దృఢానుబంధం కొనసాగుతోందని జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా చైనాకు విచ్చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో బుధవారం బీజింగ్‌లో ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ విస్తృతస్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌ ప్రసంగించారు. ‘‘పశ్చిమాసియాలో శత్రుత్వాలు తక్షణం సమసిపోవాలి. గల్ఫ్‌ మొదలు పశ్చిమాసియాదాకా యుద్ధాలు ఆగిపోవాలి. 

ఈ మేరకు చర్చలు, సంప్రతింపుల ప్రక్రియను మరింత వేగవంతంచేయాలి. సంక్షోభం సమసిపోతే ఇంధన సరఫరా, పారిశ్రామిక, సరఫరా గొలుసులు మెరుగవుతాయి. అంతర్జాతీయ వాణిజ్యం మళ్లీ గాడినపడుతుంది’’అని జిన్‌పింగ్‌ అన్నారు. రష్యాతో బంధంపై జిన్‌పింగ్‌ ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘పుతిన్‌ చైనాకు రావడం ఇది 25వ సారి. చైనా–రష్యా సత్సంబంధాన్ని పుతిన్‌ పర్యటనలు రుజువుచేస్తున్నాయి.

 కీలక అంశాలపై పుతిన్‌ బృందంతో విస్తృతస్థాయిలో లోతైన చర్చలు జరిపా. వ్యూహాత్మక చర్చలు ఫలవంతమయ్యాయి. చక్కటి స్నేహపూర్వక ఇరుగుపొరుగు దేశాలుగా మరింత మెరుగైన సహకారం కోసం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం కీలక అంశాల్లో ఏకాభిప్రాయానికొచ్చాం. చైనా, రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఈ ఏడాదితో 30 వసంతాలు పూర్తయ్యాయి. ఇంధన భద్రత, డిజిటల్‌ ఆర్థికవ్యవస్థ, కృత్రిమ మేధ, నవ్య సాంకేతికతల ఆవిష్కరణలో మరింతగా సమష్టిగా దూసుకెళ్లబోతున్నాం’’అని జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించారు.

బంధం సమున్నత శిఖరాలకు: పుతిన్‌
‘గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ పీపుల్‌’లో తర్వాత పుతిన్‌ ప్రసంగించారు. ‘‘జిన్‌పింగ్‌ నా చిరకాల మిత్రుడు. చైనాలో ఒకసామెత ఉంది. ఒక్క రోజు ఎడబాటు కూడా మూడు వసంతాలను కోల్పోయిన భావన కల్గుతుంది. చైనా, రష్యాల బంధం అలాంటిదే. జిన్‌పింగ్‌ను మళ్లీ కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. పాతికేళ్ల ఇరుదేశాల ‘చక్కటి పొరుగుదేశాల, స్నేహపూర్వక, సహకారం ఒప్పందం’ను మరింతగా విస్తరించేందుకు చైనా ఉత్సాహం కనబరుస్తోంది. ఇరుదేశాల బంధం సమున్నత శిఖరాలకు చేరుతోంది’’అని పుతిన్‌ అన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement