సెల్ఫ్–మేడ్ ఉమెన్
‘కష్టపడేవారిని అదృష్టం ఇష్టపడుతుంది’ అనేది సామెత. చైనాకు చెందిన జౌక్విన్ ఫేయ్‌ని ‘అదృష్టవంతురాలు’ అంటారు చాలామంది. అయితే ఆమె కష్టమే ఆమెను అదృష్టవంతురాలిని చేసింది. చదువు మధ్యలో మానేసి పొట్టకూటి కోసం వాచ్ లెన్స్ కంపెనీలో పనిచేసిన జౌక్విన్ ఫేయ్ నేడు ప్రపంచ ప్రసిద్ధ ‘లెన్స్ టెక్నాలజీ’ కంపెనీ యజమానురాలు...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోసం ఏర్పాటు చేసిన విందులో ఆపిల్ సీఈవో టిమ్ కుక్, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్‌ల మధ్య కూర్చున్న మహిళ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆమె పేరు... జౌక్విన్ ఫేయ్.
అదిగో... అవకాశం
గ్రామీణ హునాన్ ప్రావిన్స్‌లో జౌక్విన్ ఒక ఫ్యాక్టరీలో సాధారణ కార్మికురాలిగా పనిచేసేది. స్మార్ట్‌ఫోన్‌ల విశ్వరూపాన్ని ప్రపంచం చూడని రోజుల్లోనే గ్లాస్ ్రపొడక్షన్‌లో నైపుణ్యం సాధిస్తుండేది. పదహారేళ్ల వయసులో చదువుకు దూరమైన జౌ పని వెదుక్కుంటూ షెన్‌జెన్‌కు వెళ్లింది. ఎంతోమంది వలస కార్మికులలాగే సుదీర్ఘమైన షిఫ్టులు, ఒత్తిడితో కూడిన వాతావరణంలో పనిచేసింది. 1993లో వాచ్‌గ్లాస్‌పై స్క్రీన్ ప్రింటింగ్‌కు సంబంధించి చిన్న వర్క్‌షాప్‌ను ప్రారంభించింది.
తొలిరోజుల్లో వర్క్‌షాప్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. ఆ రోజుల్లోనే ప్రముఖ పారిశ్రామికవేత్తలు గుర్తించని ఒక అవకాశాన్ని జౌ గుర్తించింది. ‘ఎలక్ట్రానిక్స్ పలుచగా, తేలికగా, అధునాతనంగా మారేకొద్దీ గాజు తయారీకి విలువ అంతకంతకూ పెరుగుతుంది’ అనేది ఆమె గుర్తించిన విషయం. ఈ ముందుచూపు జౌను ఎక్కడికో తీసుకెళ్లింది. ఆమె చిన్న సంస్థ ‘లెన్స్ టెక్నాలజీ’ అనే అతి పెద్ద కంపెనీగా మారింది. ఎలక్ట్రానిక్స్‌లో ఉపయోగించే అధునాతన కవర్‌గ్లాస్, టచ్–స్క్రీన్ భాగాలను సరఫరా చేసే కీలకసంస్థగా అవతరించింది. స్మార్ట్‌ఫోన్, ఏఐ హార్డ్‌వేర్, స్మార్ట్ వెహికిల్స్, కాక్‌పిట్ వ్యవస్థలు, రోబోటిక్స్ పార్ట్స్ నుండి ఏరోస్పేస్ సంబంధిత తయారీ రంగం వరకు విస్తరించింది.
స్పీడ్ స్పీడ్‌గా...
టిమ్ కుక్, ఎలాన్ మస్క్‌లాంటి దిగ్గజాల మధ్య జౌ కూర్చోవడం అనేది ఆమెకు సంబంధించిన విశేషమే కాదు, అనేక పరిశ్రమలలో పెరుగుతున్న లెన్స్ టెక్నాలజీకి ప్రతీకాత్మక చిత్రం. ‘లెన్స్ టెక్నాలజీ’ కంపెనీకి స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్‌ల నుండి అధిక ఆదాయం వస్తున్నప్పటికీ, ఏఐ గ్లాసెస్, ఇంటెలిజెంట్ వెహికిల్స్, ఫ్లెక్సిబుల్ గ్లాస్ టెక్నాలజీ, ఏరో స్సేస్ ఉత్పత్తుల వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలోకి వేగంగా విస్తరించింది.
‘చైనా మాన్యుఫాక్టరింగ్’ అంటే చాలా తక్కువ ఖర్చు అనే అభి్రపాయం ఉంది. ‘లెన్స్ టెక్నాలజీ’ లాంటి సంస్థలు ఇప్పుడు ఆ అభి్రపాయాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నాయి.
అదే... విజయ రహస్యం
నా కష్టాలు చిన్న వయసులోనే మొదలయ్యాయి. ఒక ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో నాన్న కంటిచూపు కోల్పోయాడు. అయిదేళ్ల వయసులో అమ్మ చని΄ోయింది. ‘తర్వాతి భోజనం ఎక్కడ దొరుకుతుంది? దాన్ని ఎలా సంపాదించుకోవాలి?’ అని నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేదాన్ని. పదహారేళ్ల వయసులో ఒక వాచ్ లెన్స్ ఫ్యాక్టరీలో అసెంబ్లీ వర్కర్‌గా చేరాను. రాత్రిపూట అకౌంటింగ్ క్లాస్‌లకు హాజరయ్యేదాన్ని. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని కలలు కనేదాన్ని. వ్యాపారవేత్తగా నా ప్రయాణం నల్లేరు మీద నడకేమీ కాదు. ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాను. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. అయినా ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. వెనకడుగు వేసి ఉంటే ‘లెన్స్ టెక్నాలజీ’ కంపెనీ ఉండేది కాదు. ఎదురుదెబ్బలు తగిలినప్పుడు చాలామందిలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా పట్టుదలతో ముందుకు సాగడమే అసలు సిసలు విజయం.
– జౌక్విన్ ఫేయ్


