ఫైనాన్షియల్ యాంగ్జైటీ
ధరల భయం అంటే... కుటుంబ నిర్వహణ భయం. కుటుంబ నిర్వహణ భయం అంటే... గృహిణి భయం. భర్త సంపాదిస్తాడు సరే... సరిపెట్టాల్సిన బాధ్యత తనదే కదా. అందుకే ఇటీవల ఆదాయం ఉన్నా, లేకున్నా మహిళలు ‘ఫైనాన్షియల్ యాంగ్జయిటీ’తో బాధపడుతున్నారు. దీనిని ఎలా ఎదుర్కొనాలి? రెండు కేస్ స్టడీస్ చూడండి.
కేస్ స్టడీ1
లత హౌస్‌వైఫ్. వయసు 42 ఏళ్లు. భర్త ప్రైవేట్ ఉద్యోగం. ఇద్దరు పిల్లలు ఇంటర్, డిగ్రీ. నెల జీతం అరవై వేలు. అప్పుల్లేవు, సొంత ఫ్లాట్ ఉంది. కానీ లతకి ప్రతి నెలా ఒకటవ తారీఖు వచ్చిందంటే గుండె దడ.
జీతం పడిన వెంటనే లెక్కలు మొదలైపోతాయి. వెచ్చాలు, మెయింటెనెన్సు, ఇంటర్నెట్ బిల్లు, ఓటీటీ బిల్లు, పాలబిల్లు... కరెంట్... వంటగ్యాస్... పిల్లల ఫీజు... భర్తకు పెట్రోలు ఖర్చు, అత్తగారికి మావగారికి పంపాల్సినవి... ‘డబ్బులు సరిపోతాయా... రేపటికి మిగులుతాయా’... దాంతో యాంగ్జయిటీ మొదలు.
సింప్టమ్స్
యాంగ్జయిటీ వల్ల అదుపులేని చర్యలు మొదలవుతాయి. కూరగాయలు తగ్గించి కొనడం, కొత్త చీర కొనుక్కోకపోవడం, బ్యాంక్ బ్యాలెన్స్ ప్రతి గంటకి చెక్ చేయడం, రేపు ఆయన ఉద్యోగం పోతే అని ప్రతి రోజూ ఊహించుకుని ఏడవడం. దాంతో అసిడిటీ, తలనొప్పి, షుగర్ లెవెల్స్ పైకి కిందకి. భర్త ‘అన్నీ నేను చూసుకుంటా కదా’ అన్నా ఆవిడ భయం తగ్గలేదు. ఎందుకంటే సమస్య డబ్బు కాదు, మైండ్ మీద కంట్రోల్ లేకపోవడం. భర్త ఇది చూసి చూసి కౌన్సిలర్‌తో మాట్లాడించాడు. «ధరలు పెరగడం అందరికీ ఉన్న సమస్యే. నీ ఒక్కదానికే కాదు’ అని ఆమెకు అవగాహన కల్పించారు. కౌన్సిలర్ సలహాలతో లత మారింది.
లత చేసిన మార్పులు...
మనీ డేట్... అంటే నెలకు ఒకసారి భర్తతో కూర్చుని ముప్పై నిమిషాలు లెక్కలు మాట్లాడుకుంది. ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఎంత మిగిలింది... దాచడం, దాపరికం లేదు. ఈ పారదర్శకత వల్ల భయం తగ్గింది. ‘ఎమర్జెన్సీ ఫండ్’ పేరుతో బ్యాంకులో 50 వేలు ఎఫ్.డి. వేసి దానికి ‘హాస్పిటల్/జాబ్ ప్రాబ్లమ్ ఫండ్’ అని పేరు పెట్టుకుంది. ఆ డబ్బు ముట్టుకోకూడదు. ఆ పేరు చూడగానే బుర్రకి ధైర్యం. వర్రీ టైమ్ ఫిక్స్ చేసింది. అంటే రోజంతా డబ్బు గురించి ఆలోచించడం మానేసి సాయంత్రం 6 నుంచి 6:15 వరకు మాత్రమే ‘డబ్బు కష్టాలు’ ఆలోచించేది. టైం అయిపోగానే బలవంతంగా ఆపేసేది. మెల్లగా ఈ మంత్రం పని చేసింది. లత కోలుకుంది. మనం జాగ్రత్తగా ఉంటే అంత ఆందోళన చెందాల్సింది లేదు. అందరితో పాటుగా మనం కూడా ఆర్థిక గండాలను తట్టుకుంటూ ముందుకుపోవచ్చు అని భరోసా కలిగింది.
కేస్ స్టడీ 2
కవిత వర్కింగ్ ఉమన్. వయసు 35 ఏళ్లు. సింగిల్ విమెన్. తల్లిదండ్రులు, తమ్ముడి చదువు అన్నీ ఆవిడ సంపాదనే. నెల జీతం 80 వేలు. పైకి ‘లేడీ బాస్’. కానీ లోపల మాత్రం వణుకు. కవిత సమస్య ఏమిటంటే ‘గోల్డెన్ హ్యాండ్‌కఫ్స్ యాంగ్జయిటీ’. అంటే జాబ్ నచ్చకపోయినా మానేయలేని పరిస్థితి. బంగారు సంకెళ్లు. ‘నేను ఉద్యోగం మానేస్తే ఇల్లు గడవదు’ అనే ప్రెజర్. బయట పరిస్థితులు బాగా లేవు అనే ఆందోళన.
సింప్టమ్స్
స్లీప్ రివెంజ్... అంటే నిద్ర మీద పగ. రాత్రి 2 వరకు ఫోన్ చూడటం. ‘పగలంతా నాది కాదు, రాత్రైనా నాది అవ్వాలి’ అనే ఫీలింగ్. ఇంపల్స్ షాపింగ్... అంటే స్ట్రెస్‌లో రెండు వేలు మూడు వేలకు ఆన్ లైన్ షాపింగ్ చేసి, తర్వాత గిల్టీ ఫీల్ అవ్వడం. రిజెక్షన్ సెన్సిటివిటీ:... అంటే బాస్ చిన్న మాట అన్నా ‘నన్ను తీసేస్తారేమో’ అని ఏడవడం. ఫ్యూచర్ బ్లైండ్‌నెస్... ‘పెళ్లి, పిల్లలు వద్దు. డబ్బు సరిపోదు’ అని జీవితాన్ని పోస్ట్‌పోన్ చేయడం.
కవిత కలీగ్ ఇదంతా గమనించింది. కవితను కౌన్సిలర్ దగ్గరకు తీసుకెళ్లింది. ‘అంతా నార్మల్‌గా ఉన్నా అనవసర ఆందోళనతో బాధపడుతున్నావు’ అని కౌన్సిలర్ చిన్న సూచనలు చేసింది.
కవిత చేసిన మార్పులు...
ఒన్ పర్సెంట్ రూల్... అంటే తన జీతంలో ఒన్ పర్సెంట్ అంటే 800 తన సంతోషం కోసం అప్పుడప్పుడు ఖర్చు పెట్టడం మొదలుపెట్టింది. కాఫీ, పుస్తకం, మూవీ... ‘నేను కేవలం ఏటీఎం కాదు, మనిషిని’ అని గుర్తుచేసుకోవడానికి స్కిల్ ఇన్సూరెన్స్... అంటే వీకెండ్‌లో రెండు గంటలు ఫ్రీలాన్స్ కోర్స్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. ‘ఈ జాబ్ పోయినా నేను బతకగలను’ అనే ధైర్యం కోసం. జాబ్ కంటే స్కిల్ మీద నమ్మకం పెంచుకుంది. నో–బడ్జెట్ డే... నెలకు ఒక రోజు బడ్జెట్, లెక్కలు, ఫోన్‌లో బ్యాంక్ బేలెన్స్ చూడకూడదు. ఆ రోజు బుర్రకి హాలిడే.
దీనివల్ల మిగతా 29 రోజులు బుర్ర కంట్రోల్‌లో ఉంటుంది. ఆరు నెలల తర్వాత కవిత మొదటిసారి మూడు రోజులు గోవా వెళ్లొచ్చింది. ‘అదే సంపాదన. ఆరు నెలలు కొంచెం కొంచెం దాచాను. నా వల్ల అయ్యింది’ అని ఏడ్చేసింది ఎయిర్‌పోర్ట్‌లో. డబ్బు భయం ‘పేదవాళ్ల’ సమస్య మాత్రమే కాదు. బ్యాంక్‌లో లక్షలు ఉన్నవాళ్లకు కూడా ఫైనాన్షియల్ యాంగ్జైటీ ఉంటుంది. ఇది పర్సు సమస్య కాదు, ‘పర్సనల్ సెక్యూరిటీ’ ఫీలింగ్ సమస్య. దీన్ని మందులతో కాదు, మనసుతో గెలవాలి.
కుటుంబం ఏం చేయాలి?
భర్త, భార్య, పిల్లలు... ఇంట్లో అందరికీ బేసిక్ లెక్కలు తెలియాలి. భారం ఒక్కరి మీద పడితే యాంగ్జైటీ వస్తుంది. ప్రతి సమస్యను అందరూ చర్చించుకుంటే ఏవి కొనసాగించాలో ఏవి వదులుకోవాలో అందరికీ తెలుస్తుంది. ఫైనాన్షియల్ యాంగ్జయిటీతో రోజూ ఏడుపు, గుండె దడ, నిద్ర లేకపోవడం రెండు వారాలకు మించి ఉంటే – సైకాలజిస్ట్‌ని కలవండి. డబ్బు ప్లానింగ్ రాకపోతే సెబి రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కలవండి. ఇందులో సిగ్గు పడాల్సింది ఏమీ లేదు.


