దట్టమైన అటవీ ప్రాంతంలో జీపు సఫారీ..బెంగాల్ పులులు, చిరుతపులులు, ఎలుగుబంట్లను దగ్గరినుంచి తిలకించడం, రిజర్వాయర్‌లో బోటు షికారు.. నదుల మధ్య కాటేజీలు, తాబేలు, మొసలి వంటి థీమ్ కాటేజీలు, ట్రెక్కింగ్ చేయాలన్నా.. చూడాలన్నా ఏ విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ వేసవిలో తెలంగాణ రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో పర్యటిస్తే చాలు వన్య్రప్రాణుల సహజసిద్ధమైన జీవన శైలిని కళ్లారా చూస్తూ.. ప్రకృతి ఒడిలో సేదతీరవచ్చు. ఈ వేసవిలో పర్యాటకులకు మంచి అనుభూతిని మిగిల్చేందుకు రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్ర అటవీ, పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తున్నాయి.
ప్రకృతిని, వన్య ప్రాణులను దగ్గరి నుంచి చూడాలనుకునే వారికి సంతృప్తి పరిచేలా పలు పర్యాటక ప్రాంతాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అడవులు, అటవీ జంతువులు, పక్షులు, నదులు, సహజ సిద్ధంగా ఏర్పడిన అందాలు, కృష్ణా, గోదావరి నదుల మధ్యలో కాటేజీలు ఇలా ఏ ప్రకృతి అందాన్ని ఆస్వాదించాలనుకున్నా అందుకు తగిన ΄్ప్రాకేజీలు సిద్ధం అవుతున్నాయి. తెలంగాణలోని ప్రధాన వన్య్ప్రాాణి పర్యాటక కేంద్రాలు ఇలా ఉన్నాయి. పర్యాటకులు తమ పర్యటనను అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. వేసవి ఎండల దష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో విస్తరించి ఉన్న కవ్వాల్ అటవీ ప్రాంతం టేకు చెట్లకు ప్రసిద్ధి. ఓపెన్ టాప్ జీపుల్లో అడవి లోపలికి తీసుకెళ్తారు. ఉదయం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు, అలాగే 9:30 నుంచి 11:30 గంటలు; మధ్యాహ్నం 3:30 – 5:30 వరకు సఫారీ అందుబాటులో ఉంటుంది. సాధారణ రోజుల్లో జీపునకు (6 గురు వరకు) రూ.3,500, వారాంతాల్లో రూ.4వేల వరకు ఉంటుంది. ఏటూరునాగారం వన్య్రప్రాణి అభయారణ్యం (తాడ్వాయి)
వరంగల్ సమీపంలోని ఏటూరు నాగారం వన్య్రప్రాణి అభయారణ్యంలో ’తాడ్వాయి హట్స్’ (కుటీరాలు), ’నైట్ వాచ్’ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. జీపు సఫారీకి రూ.1,500లు, అటవీ ట్రెక్కింగ్‌కు ఒక్కొక్కరికి రూ.100 ఉంటుంది. అలాగే సైక్లింగ్ సౌకర్యం ఉంది. ఇక్కడ భారీ ఉడుతలు, అడవి దున్నలు కనిపిస్తాయి.

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (నల్లమల అడవులు)
హైదరాబాద్‌కు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ భారతదేశంలోని అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రాలలో ఒకటి. ఇక్కడ ‘టైగర్ స్టే‘ ప్యాకేజీ ప్రత్యేక ఆకర్షణ. ఇందులో పర్యావరణ విద్యా కేంద్రం సందర్శన, సఫారీ, ట్రెక్కింగ్ ఉంటాయి. ఫరాహాబాద్ సర్క్యూట్‌లో ఈ సఫారీ సాగుతుంది.
కృష్ణా నది అందాలను చూస్తూ గడపడానికి తాబేలు, మొసలి వంటి థీమ్ కాటేజీలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అమ్రాబాద్‌లో మూడు రకాల సఫారీలు అందుబాటులో ఉన్నాయి. ఫరాహాబాద్ సఫారీ మెుత్తం 16 కి.మీ. ప్రయాణం కాగా... 7 సీట్ల వాహనానికి రూ. 3 వేలు ఛార్జ్ చేస్తున్నారు. గుండం సఫారీ దట్టమైన అడవిలో 35 కి.మీ. ప్రయాణం కాగా.. వాహనానికి రూ. 5 వేలు, అక్కమహాదేవి గుహల సఫారీ 14 కి.మీ ప్రకృతి అందాల మధ్య ప్రయాణానికి.. 5 సీట్ల వాహనానికి రూ. 3 వేలు వసూలు చేస్తున్నారు.
కిన్నెరసాని వన్య్రప్రాణి అభయారణ్యం (కొత్తగూడెం)
ఖమ్మం సమీపంలోని కొత్తగూడెంలో ఉన్న ఈ ప్రాంతం నీరు, పచ్చదనంతో అలరారుతుంటుంది. డీర్ పార్క్ (జింకల పార్క్), రిజర్వాయర్‌లో బోటింగ్ సౌకర్యం కలవు. ఇక్కడి ప్రకతి అందాల మధ్య ప్రశాంతంగా గడపడానికి కాటేజీలు అందుబాటులో ఉన్నాయి.. భద్రాచలం పుణ్యక్షేత్రం వెళ్లే సమయంలో వీటిని సందర్శించవచ్చు.
– బొల్లం శ్రీనివాస్, సాక్షి ప్రతినిధి, ఖమ్మం


