మల్లారెడ్డి యూనివర్సిటీలో సేంద్రియ పరిశోధనల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు
పాలీహౌస్ సేంద్రియ సేద్యంలో ఎకరానికి 8 టన్నుల కాలీఫ్లవర్, 9 టన్నుల రెడ్ క్యాబేజీ దిగుబడి
సేంద్రియ కూరగాయల సాగులో ఒకటికి నాలుగు రకాల సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు కలిపి వాడినప్పుడు మాత్రమే అన్ని రకాల పోషకాలు సమతుల్యంగా అందుతాయని, తద్వారా అత్యుత్తమ దిగుబడులు సాధించగలమని తాజా పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయం, పరివృద్ధి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పాలీహౌస్‌లో రెడ్ క్యాబేజీ, కాలీఫ్లవర్ పంటలను ప్రయోగాత్మకంగా పూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తూ 2025–26 శీతాకాల పంటలో ఉత్తమ ఫలితాలు సాధించారు.
మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ డీన్ డాక్టర్ ఎ. రాజారెడ్డి పర్యవేక్షణలో హార్టికల్చర్ అసిస్టెంట్ ్రపొఫెసర్లు డా. సీహెచ్ షణ్ముఖి, డా. టి. శిరీష నిర్వహిస్తున్న ఈ మూడేళ్ల పరిశోధనా ప్రాజెక్టుకు భారతీయ కిసాన్ సంఘ్‌కు చెందిన సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఎం.ఎస్. సుబ్రహ్మణ్యం రాజు సాంకేతిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.
కాలీఫ్లవర్ ఎకరానికి 8 టన్నులు
పూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పాలీహౌస్‌లో ఎత్తు మడులపై కాలీఫ్లవర్‌ను వివిధ రకాల, వివిధ మోతాదుల్లో సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ 9 రకాల కాంబినేషన్లతో ప్రయోగాత్మక సాగు చేశారు. హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువు మాత్రమే వాడుతూ పాలీహౌస్‌లో కాలీఫ్లవర్ సాగు చేస్తే 5.8 టన్నుల దిగుబడి వచ్చింది. అయితే, కోళ్ల ఎరువుతో పాటు 3 రకాల జీవన ఎరువులు వాడితే అత్యధికంగా హెక్టారుకు 8 టన్నులకుపైగా సేంద్రియ కాలీఫ్లవర్ దిగుబడి వచ్చింది. హెక్టారుకు 7.5 టన్నుల కోళ్ల ఎరువుతో పాటు వామ్ 5 కిలోలు, అజోస్పిరిల్లం 2 కిలోలు, పీఎస్బీ 5 కిలోలు వాడినప్పుడు అత్యధికంగా ఒక్కో కాలీఫ్లవర్ బరువు 825 గ్రాములు తూగింది. ఎకరానికి పది వేల మొక్కల చొప్పున 8టన్నులకు పైగా దిగుబడి వచ్చింది. అయితే, జీవన ఎరువులతో పాటు వర్మీ కంపోస్టు లేదా జీవామృతం లేదా లిగ్నైట్ కలిపి వాడినప్పుడు.. కోళ్ల ఎరువుతో పాటు జీవన ఎరువులు వాడినప్పటికన్నా తక్కువ దిగుబడి రావటం విశేషం.
రెడ్ క్యాబేజీ ఎకరానికి 9 టన్నులు
పూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పాలీహౌస్‌లో ఎత్తు మడులపై రెడ్ క్యాబేజీ పంటను వివిధ రకాల, వివిధ మోతాదుల్లో సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ 6 రకాల కాంబినేషన్లతో ప్రయోగాత్మక సాగు చేశారు. పాలీహౌస్‌లో హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువు మాత్రమే వాడితే హెక్టారుకు 5 టన్నుల రెడ్ క్యాబేజీ దిగుబడి వచ్చింది. అయితే, హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువుతో పాటు మరో 4 రకాల సేంద్రియ ఎరువులు వాడితే హెక్టారుకు అత్యధికంగా 9 టన్నులకుపైగా సేంద్రియ రెడ్ క్యాబేజీల దిగుబడి వచ్చింది. హెక్టారుకు 5 టన్నుల పశువుల ఎరువు, వర్మీకంపోస్టు 2 టన్నులు, వేపపిండి 1 టన్ను, లిగ్నైట్ 2 టన్నులు, ద్రవరూప జీవన ఎరువులు 2 లీటర్లు వాడారు. ఒక్కో రెడ్ క్యాబేజీ బరువు 962 గ్రాములు తూగింది. ఎకరానికి పది వేల మొక్కల చొప్పున 9 టన్నులకు పైగా దిగుబడి రావటం విశేషం. అయితే, పశువుల ఎరువు అసలు వాడకుండా.. హెక్టారుకు వర్మీకంపోస్టు 2 టన్నులు, వేపపిండి 1 టన్ను, లిగ్నైట్ 2 టన్నులు, ద్రవరూప జీవన ఎరువులు 2 లీటర్లు వాడినప్పుడు ఒక్కో రెడ్ క్యాబేజీ బరువు 935 గ్రాములకు మాత్రమే పెరిగింది.
సమతుల్య పోషణే కీలకం
సేంద్రియ సాగులో పంటలకు అవసరమైన అన్ని పోషకాలనూ సమతుల్యంగా తగు పాళ్లలో అందించగలిగినప్పుడే రసాయన సేద్యంతో సమానంగా దిగుబడులు సాధించటం సాధ్యమవుతుందని మల్లారెడ్డి యూనివర్సిటీలో తాజా పరిశోధనలు తేల్చాయి. పాలీహౌస్ ప్రయోగాత్మక సాగులో ఎకరానికి 8 టన్నుల కాలీఫ్లవర్, 9 టన్నుల రెడ్ క్యాబేజీ దిగుబడులు మాకు సంతృప్తి కలిగించాయి. అన్ని యూనివర్సిటీలూ ఈ దిశగా పరిశోధనలు చేస్తే రైతులకు మంచి ఆదాయంతో పాటు వినియోగదారులకు ఆరోగ్యదాయకమైన ఆహారం లభిస్తుంది.
– ఎం.ఎస్. సుబ్రహ్మణ్యం రాజు (76598 55588), సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ నిపుణులు
సేంద్రియ పరిశోధనలు కొనసాగిస్తాం
పూర్తిగా సేంద్రియ కూరగాయల సాగులో మూడేళ్ల పరిశోధనా ప్రాజెక్టు తొలి ఏడాది ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మరో రెండు సంవత్సరాలు ఈ ప్రయోగాలు కొనసాగిస్తాం. సేంద్రియ ఎరువుల యాజమాన్యం, దిగుబడుల స్థిరీకరణ చేసి పూర్తి ఫలితాలు ఆ తర్వాత ప్రకటిస్తాం.
– డాక్టర్ ఎ. రాజారెడ్డి, డీన్, స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, మల్లారెడ్డి యూనివర్సిటీ
నిర్వహణ: పంతంగి రాంబాబు


