తాడేపల్లి: అమరావతి కోసం భూములిచ్చిన రైతుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పా అని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ప‍్రశ్నించారు. సోమవారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మంత్రి నారాయణ సమాధానం చెప్పాలి కదా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాపై ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేస్తారా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కోసం ఏం చేశారు? అమరావతిలో అద్దాల కోసం రూ.2,500 కోట్లు కేటాయించారు. భూములు ఇచ్చిన రైతులకు మీరు ఏం చేశారు?
కేంద్ర మంత్రి పెమ్మసానికి రైతుల కష్టం తెలుసా? రైతులకు ఇచ్చిన ప‍్లాట్లలో పనులు జరుగుతున్నాయా? రైతుల కోసం నేను మాట్లాడితే యూట్యూబ్ నుంచి తొలగిస్తారా? చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా చమటలు పట్టిస్తోంది. అమరావతిలో మట్టి వ్యాపారం తప్ప మరేమీ జరగటం లేదు. నిత్యం వెయ్యి టిప్పర్లలో మట్టి తరలిపోతోంది. మట్టి మీదనే టీడీపీ ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు.
కానీ భూములు ఇచ్చిన రైతులు మాత్రం రోడ్డున పడ్డారు. ఆ రైతుల సమస్యలపై మాట్లాడితే నేరం అంట. అదే ఎల్లోమీడియా చర్చలు పెట్టినా, మంత్రి నారాయణ మాట్లాడితే బాగుంటుందంట. రైతుల సమస్యలు ఉన్నాయనే కదా త్రీమెన్ కమిటీ వేసింది? మాకు సమాధానం చెప్పలేక మాపై కేసులు నమోదు చేస్తున్నారు.
రాజధానిపై నేను మాట్లాడిన ప్రతి వీడియోనూ తొలగించాలని యూట్యూబ్, ట్విట్టర్ లకు లేఖలు రాశారు. సచివాలయం పునాదుల దశలోనే ఉంది. కానీ, అప్పుడే అద్దాలకు టెండర్లు పిలిచారు . ఈ రెండేళ్లలో సగమైనా కట్టిన బిల్డింగ్ ఒక్కటైనా ఉందా? రైతులను విపరీతంగా వాడుకుని ఊరూరా తిప్పారు. భూములు ఇచ్చిన రైతులు మంత్రి నారాయణ చుట్టూ రైతులు తిరగటమే సరిపోయింది. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ తిప్పుకుంటున్నారు.
ఇక కేంద్ర మంత్రి పెమ్మసానికైతే అసలు రైతుల కష్టాలే తెలియదు. ఎన్ఆర్ఐ మహిళ ఒకరు శ్రీకాళహస్తి ఆలయంలోని అవినీతి గురించి ప్రశ్నిస్తూ వీడియో పెడితే దాన్ని తొలగించారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించే ప్రతి వీడియోను తొలగిస్తున్నారు. రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లను ఎందుకు ఇవ్వలేదు? బెజవాడ, గుంటూరు చుట్టుపక్కల లేఅవుట్లకు అమరావతిలోని మట్టిని తరలిస్తున్నారు.
రోజూ వెయ్యి టిప్పర్ల మట్టి బయటకు వెళ్తుంది. చంద్రబాబు మౌఖిక ఆదేశాలతో మట్టి వ్యాపారం జరుగుతోంది. దీని గురించి ప్రశ్నిస్తే తప్పా? భూములు ఇచ్చిన రైతులను గాలికి వదిలేశారు. అమరావతిలో ఎయిర్ పోర్ట్ కడితే మరి గన్నవరం ఎయిర్ పోర్ట్ సంగతేంటి? అశ్వనీ దత్, బ్రాహ్మణి, బలుసు శ్రీనివాసరావు, తదితరులకు ప్రైమ్ లొకేషన్ లో భూములు ఇచ్చారు.
భూములు ఇచ్చిన రైతులకు మాత్రం తీవ్ర అన్యాయం చేస్తున్నారు. సీఆర్‌డీఏ ఆఫీసుకు అద్దాల ఖర్చే భారీగా ఉంది. హెరిటేజ్ సంస్థ నుంచి డబ్బు తెచ్చి అమరావతిలో పెడుతున్నారా? ప్రజా సొమ్మును ఎందుకిలా వృధా చేస్తున్నారు? ఇప్పుడు అమరావతిలో జరుగుతున్నది మట్టి వ్యాపారమే. 29 గ్రామాల రైతులు నరకం చూస్తున్నారు.
పవన్ కల్యాణ్‌కు ఈ ప్రభుత్వం కూలిపోతుందని అర్థం అయింది. అందుకే కొత్త గెటప్ లోకి వెళ్తున్నారు. అందుకే జై అమరావతి కాకుండా జై ఆంధ్రా అనమంటున్నారు. జై అమరావతి అంటే ఆ 29 గ్రామాలకే పరిమితం అవుతామన్న భయంతో పవన్ ఉన్నారు. జనసేన కార్యకర్తలను టీడీపీ వారు కొడుతుంటే మాత్రం పవన్ కు కనపడటం లేదు’’ అని అన్నారు.


