మంత్రి టీజీ భరత్‌కు సిద్ధార్థ‌రెడ్డి కౌంట‌ర్‌ | Byreddy Siddharth Reddy Hits Back At Minister TG Bharat Over MLA Ticket Remarks, Check More Details Inside | Sakshi
Sakshi News home page

మంత్రి టీజీ భరత్‌కు సిద్ధార్థ‌రెడ్డి కౌంట‌ర్‌

May 18 2026 3:26 PM | Updated on May 18 2026 5:12 PM

Byreddy Siddharth Reddy comments on TG Bharath

కర్నూలు: తాను ఎమ్మెల్యే కావాలనే కోరిక త‌న‌కంటే మంత్రి టీజీ భరత్‌కే ఎక్కువగా ఉన్నట్టు క‌న‌బ‌డుతోంద‌ని వైఎస్సార్‌సీపీ యువ‌జ‌న రాష్ట్ర‌ విభాగం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి ఎద్దేవా చేశారు. కర్నూలులో సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నాయ‌కుల వేధింపుల‌ బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ తాము ధర్నాలు చేస్తే తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ టీజీ కుటుంబంపై మండిప‌డ్డారు. టీజీ వెంకటేశ్ అంటే గౌరవం ఉండేదని.. కానీ తనపై చేసిన వ్యాఖ్యలు చూశాక, ఆయ‌న‌పై గౌరవం పోయింద‌న్నారు. త‌న తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని టీడీపీ నేత‌లు తిట్టినా స్పందించ‌ని ఎంపీ  బైరెడ్డి శ‌బ‌రి.. మంత్రి భరత్ గురించి తాను మాట్లాడితే పరుగెత్తుకుంటూ వచ్చి ప్రెస్‌మీట్లు పెట్టడం విడ్డూరంగా ఉంద‌ని సిద్ధార్థ‌రెడ్డి అన్నారు.

ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని పోటీ చేయాలంటూ త‌న‌పై మంత్రి భ‌ర‌త్ చేసిన వ్యాఖ్య‌ల‌కు గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు సిద్ధార్థ‌రెడ్డి. టీజీ భరత్ 48 సంవత్సరాల వ‌య‌సులో మంత్రి అయ్యార‌ని,  43 ఏళ్ల వ‌య‌సులో ఎమ్మెల్యేగా పోటీ చేశార‌ని.. ఇప్పుడు ఆయ‌న వ‌య‌సు ఇప్పుడు 50 ఏళ్లు అని చెప్పారు. 'నీ వయసుకు వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేయకపోతే అప్పుడు అడగండి' అంటూ భ‌ర‌త్‌కు కౌంట‌ర్ ఇచ్చారు. 

''కర్నూలు మూడో ప‌ట్ట‌ణ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో వైఎస్సార్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల‌కు నిర‌స‌న‌గా, అక్ర‌మ కేసుల‌కు వ్య‌తిరేకంగా ఈనెల 14న‌ మేము ధ‌ర్నా కార్య‌క్ర‌మం నిర్వ‌హించాం. టీడీపీ నాయ‌కుల‌ వేధింపుల కార‌ణంగా క‌ర్నూలు ప‌ట్ట‌ణంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న స‌తీశ్ అనే కుర్రాడి కుటుంబానికి న్యాయం చేయాల‌న్న డిమాండ్‌తో ఆ రోజు  ధ‌ర్నా చేశాం. బాలు మ‌రో కుర్రాడిపై పోలీసులు వేధింపులు ఆగాల‌న్న ఉద్దేశంతోనూ ధ‌ర్నా చేప‌ట్టాం. మూడో ప‌ట్ట‌ణ పోలీస్ స్టేష‌న్ సీఐపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ కార్యాయ‌లం ద‌గ్గ‌ర ధ‌ర్నాకు దిగాం. ప్ర‌భుత్వాన్ని, మంత్రి టీజీ భ‌ర‌త్‌కు ప్ర‌శ్నించామ‌ని గ‌డ‌చిన 3 రోజులుగా టీడీపీ నేత‌ల, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీజీ వెంక‌టేశ్ త‌దిత‌రులు మా గురించి ర‌క‌ర‌కాలు మాట్లాడారు. వారి మాట‌ల‌కు స‌మాధానం చెప్పాల‌నే మీడియా ముందుకు వ‌చ్చాను. 

స‌తీశ్ కుటుంబానికి మంత్రి టీజీ భ‌ర‌త్ న్యాయం చేసివుంటే క‌ర్నూలు టౌన్‌లో ఆయ‌న స్థాయి వంద‌శాతం పెరిగేది. ఆయ‌న ఆ ప‌ని చేయ‌కుండా సిద్ధార్థ‌రెడ్డిని తిట్టిన‌వాళ్ల‌కు ప‌దివేల రూపాయ‌లు, సిద్ధార్థ‌రెడ్డిపైనా సెల్ఫీ వీడియో చేసిన వాళ్ల‌కు ఇర‌వై వేల రూపాయ‌లు, ప్రెస్‌మీట్ పెడితే కార్పొరేట‌ర్ సీటు, సిద్ధార్థ‌రెడ్డి ఇంటి మీద‌కు పోతే స్టోర్ బియ్యం వంటివి చేయ‌డంతో క‌ర్నూలు టౌన్‌లో టీజీ భ‌ర‌త్ స్థాయి 500 శాతం ప‌డిపోయింది. స‌తీశ్ కుటుంబానికి న్యాయం చేయ‌మ‌ని నేను అడిగితే ఆయ‌న ప్రెస్‌మీట్ పెట్టి.. సిద్ధార్థ నువ్వు టికెట్ తెచ్చుకో. మూడు ఎల‌క్ష‌న్లు చేసినా ఏ పార్టీ కూడా నీకు టికెట్ ఇవ్వ‌లేద‌ని మాట్లాడారు. భ‌ర‌త్ వ‌య‌సు ఇప్ప‌డు 50 సంవ‌త్స‌రాలు. 48 ఏళ్ల వ‌య‌సులో ఎమ్మెల్యే అయ్యారు. 43 ఏళ్ల వ‌య‌సులో మొట్ట‌మొద‌టిసారిగా ఎమ్మెల్యేగా నిలబ‌డ్డారు. నా వ‌య‌సు 33 సంవ‌త్స‌రాలు. మీ వ‌య‌సు వ‌చ్చిన‌ప్ప‌డు నాకు టికెట్ రాకుంటే అప్పుడు అడ‌గండి. నేను ఎమ్మెల్యే కావాల‌నే కోరిక నా క‌న్నా మీకు ఎక్కువ ఉండ‌డ‌మేంటి? 

33 సంవ‌త్స‌రాల‌కు నేను శాప్ చైర్మ‌న్‌ను అయ్యాను. వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడిని అయ్యాను. నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గానికి ఇన్‌చార్జిని అయ్యాను. నా వెంట తిరిగిన ఎంతో మందిని ఎంటీసీ, జెడ్పిటీసీ, స‌ర్పంచ్‌, మున్సిప‌ల్ చైర్మ‌న్‌, కౌన్సిల‌ర్లుగా గెలిపించుకున్నాను. రాష్ట్రంలో ఎన్నో నియోజ‌క‌వర్గాల్లో పార్టీ త‌ర‌పున ప్ర‌చారం చేశాను. ఎన్నో ప్రెస్‌మీట్లు, ర్యాలీలు, ధ‌ర్నాలు చేశాను. 33 ఏళ్ల‌కే ఒక గుర్తింపు తెచ్చుకున్నాను. అదే 33 సంవ‌త్స‌రాల‌కు మీరు ఉయ్యాల ఊగుతున్నారా? స‌తీశ్ కుటుంబానికి న్యాయం చేయ‌మ‌ని మేము అడుగుతుంటే ఏదేదో మాట్లాడుతున్నార‌''ని సిద్ధార్థరెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.    

ఏంటి ఈ చిల్లర వేషాలు.. భరత్ గారు మీ వయసెంత? సిద్దార్థ్ సీరియస్

 

Advertisement
 
Advertisement
Advertisement