యువకుడిని ముక్కలు ముక్కలుగా చేసి.. దారుణ హత్య | Assassination incident in prakasam district | Sakshi
Sakshi News home page

యువకుడిని ముక్కలు ముక్కలుగా చేసి.. దారుణ హత్య

May 21 2026 5:27 AM | Updated on May 21 2026 5:27 AM

Assassination incident in prakasam district

మైనర్‌ అయిన తమ కుమార్తెతో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకే దారుణం 

అట్లపెనంతో కొట్టి చంపేసిన బాలిక తల్లిదండ్రులు 

ఒక రోజంతా ఇంట్లోనే మృతదేహం  

మరుసటి రోజు ముక్కలుగా చేసి బోరుబావిలో పడేసిన వైనం

యర్రగొండపాలెం: తమ కుమార్తెతో సన్నిహితంగా ఉన్న యువకుడిని బాలిక తల్లిదండ్రులు దారుణంగా హత్య చేసి, అతని శరీర భాగాలను ముక్కలుగా నరికి పొలాల్లో ఉన్న బోరు బావిలో పడేసిన దారుణ ఘటన మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది. ఈ ఘటన­కు సంబంధించిన వివరాలను మార్కాపురం డీవైఎస్పీ కె.నాగరాజు బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చెంచు కాలనీకి చెందిన దిగుడు ఆంజనేయులు (21) ఈ నెల 13వ తేదీ రాత్రి ఓ 15 ఏళ్ల బాలిక ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు ఊర్లోకి వెళ్లారు.

 రాత్రి 10 గంటల సమయంలో తిరిగి ఇంటికి వచ్చి తలుపులు తెరిచి చూస్తే బాలికతో ఆంజనేయులు సన్నిహితంగా ఉండటాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆమె తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. ఆవేశంలో ఇంట్లో ఉన్న అట్లపెనం తీసుకొని యువకుడి తలపై మోదడంతో అతను మృతి చెందాడు. మరుసటి రోజు కూడా ఆ మృతదేహాన్ని తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. వాసన వస్తుండటంతో నిందితులు మృతదేహాన్ని మా­యం చేసేందుకు శరీర భాగాలను ముక్కలుగా నరికి అక్కడికి సమీపంలోని ప్రైవేటు స్కూలు వెనుక వైపు పొలాల్లో ఉన్న ఒక బోరుబావిలో పడేశారు. 

ఈ నెల 13వ తేదీ నుంచి ఆంజనేయులు కనిపించకుండా పోయాడని అతని బావ చెల్లె వెంకటరావు ఈ నెల 16న ఇచి్చన ఫిర్యాదు మేరకు సీఐ కె.అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఎస్సై దేవకుమార్‌ దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఆంజనేయులు సెల్‌ ఆధారంగా బాలిక ఇంటి వద్ద అదృశ్యమైనట్లు నిర్ధారణకు వచ్చారు. అనుమానాస్పదంగా ఉన్నబాలిక తల్లిదండ్రులకు పెద్దారవీడు మండలంలోని బోడ్రెడ్డిపల్లె జంక్షన్‌ వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా ఆంజనేయులును తామే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. దీంతో వారిని అరెస్టు చేసినట్లు డీవైఎస్పీ తెలిపారు. వారి కుమార్తెను త్వరలో అరెస్ట్‌ చేస్తామని చెప్పారు. 

కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ కె.అజయ్‌కుమార్, ఎస్సై ఎం.దేవకుమార్‌లను ఆయన అభినందించారు. బోరు­బావిలో ఉన్న శరీర భాగాలను వెలికి తీసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా డీవైఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో మృతుడు ఆంజనేయులు బంధువులు పోలీస్‌ స్టేషన్‌లో గొడవకు దిగారు. వెంటనే బోరుబావిలో ఉన్న శరీర భాగాలను వెలికి తీయాలని, నిందితులను అరెస్ట్‌ చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement