gas rate
-
చాయ్ గరం.. బిర్యానీ పిరం..
హైదరాబాద్ అనగానే ఎవరికైనా గుర్తొచ్చే దమ్ బిర్యానీ, ఇరానీ చాయ్ మొదలు అన్నిరకాల ఆహార పదార్థాలపై గ్యాస్ ధర పెంపు ప్రభావం పడింది. మొన్నటి వరకు రూ.220 నుంచి రూ.300 వరకు ఉన్న ప్లేట్ చికెన్, మటన్ బిర్యానీ ధర ఇప్పుడు రూ.270 నుంచి రూ.380కి చేరింది. పాతబస్తీలోని ఒక ప్రముఖ హోటల్లో మటన్ బిర్యానీ ప్లేట్ రూ.320 నుంచి ప్రస్తుతం రూ.360కి పెరిగింది. గచ్చిబౌలిలోని ఒక హోటల్లో మొన్నటివరకు రూ.340 ఉండగా రూ.380కు, ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని ఒక ప్రముఖ రెస్టారెంట్లో రూ. 320 నుంచి 360 పెరిగింది. ఇక నగర ప్రజలు ఇష్టంగా తాగే ఇరానీ చాయ్ రూ.12 నుంచి రూ.20కి ఎగబాకింది.పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో చమురు సంక్షోభం గ్యాస్ దిగుమతులపై ప్రభావం చూపించడం, వాణిజ్య సిలిండర్ ధర గణనీయంగా పెరగడంతో ఫుడ్ ఇండస్ట్రీపై పిడుగు పడినట్టయ్యింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో టీ స్టాళ్లు మొదలుకుని కర్రీ పాయింట్లు, టిఫిన్ బండ్లు, చిన్న హోటళ్లు, స్టార్ హోటళ్ల వరకు అన్నిట్లోనూ ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. ఎక్కడ చూసినా ‘ధరలు పెంచాం – సహకరించండి’అనే బోర్డులు కనిపిస్తున్నాయి. టీ నుంచి బిర్యానీ వరకు అన్నింటిపైనా సగటున 20% నుంచి 40% వరకు అదనంగా ధరలు పెరిగాయి. నగరంలోని ప్రతి నలుగురిలో ఒకరు బయటి ఆహారంపైనే ఆధారపడుతున్నారనే అంచనాల నేపథ్యంలో పెరిగిన ధరలు వారికి భారంగా మారాయి. 30 శాతం జనానికి హోటలే దిక్కు! నగర జనాభా 1.55 కోట్లు దాటింది. అందులో సుమారు 30 శాతం అంటే సుమారు 46.50 లక్షల మంది నిత్యం బయటి ఆహారంపైనే ఆధారపడి ఉంటారన్నది అంచనా. కాగా తాజా గ్యాస్ ధర ప్రభావంతో ఆహార ప్రియులపై రోజుకు సగటున రూ.40 నుంచి రూ.60 అదనపు భారం పడుతోంది. ఈ లెక్కన నగరంపై రోజుకు సగటున రూ.20 కోట్ల వరకు అదనపు భారం పడుతుండగా, నెలకు రూ.600 కోట్లు దాటిపోతోంది. ఇంట్లో వంట సదుపాయం ఉన్నప్పటికీ టీ, టిఫిన్లు, భోజనాల కోసం 20.25 లక్షల మంది హోటళ్లకు వెళుతుంటారని అంచనా. మిగిలిన 26.25 లక్షల మంది విద్య, శిక్షణ, ఉపాధి, వైద్యం, ఇతరత్రా పనుల కోసం నగరానికి వచ్చి హాస్టళ్లు, అద్దె రూమ్‌లు, లాడ్జీల్లో ఉంటూ అనివార్యంగా బయటి భోజనంపైనే ఆధారపడుతుంటారు. నలుగురితో కూడిన ఒక కుటుంబం హోటల్‌కు వెళ్లి భోజనం చేసి రావాలంటే రూ. 500 నుంచి రూ.1,000 వరకు అదనంగా బిల్లు అవుతున్నట్టు తెలుస్తోంది. కడుపు నింపని భోజనం! నగరంలోని అమీర్‌పేట్, అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్ మాదాపూర్ వంటి ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు, నిరుద్యోగులు ఐటీ ఉద్యోగులు నూటికి నూరు శాతం మెస్‌లు, కర్రీ పాయింట్లపైనే ఆధారపడుతుంటారు. ప్రస్తుతం వీరి నెలవారీ మెస్ చార్జీలు కూడా పెరిగాయి. గ్యాస్ ధర పెంపుతో అమాంతం ధరలు పెంచిన మెస్‌లు.. మెనూ మాత్రం తగ్గించేశాయి. పప్పులో పప్పు ఉండటం లేదని, చారులో రుచి కరువయ్యిందని, పరిమాణం తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక హోటళ్లలో కూడా మొన్నటివరకు ఇద్దరికి సరిపోయే ’ఫుల్ బిర్యానీ’ఇప్పుడు ఒకరికి కొంచెం ఎక్కువ, ఇద్దరికి తక్కువ అన్నట్లుగా మారిపోయిందని అంటున్నారు. కర్రీ..వర్రీ నగరంలో కర్రీ పాయింట్లకు యమ గిరాకీ అన్న సంగతి తెలిసిందే. కీలక ప్రాంతాల్లో గల్లీకో కర్రీ పాయింట్ ఉంటోంది. ప్రస్తుతం నాన్ వెజ్, వెజ్..అన్నిరకాల కూరల ధరలూ పెరిగాయి. ప్రతి కర్రీపై రూ.10 నుంచి రూ. 20 వరకు పెరుగుదల చోటు చేసుకుంది. కర్రీ పాయింట్లలో ఒక కప్పు కూర ధర రూ. 30 నుంచి రూ. 50కి చేరడంతో, రెండు కూరలు కొనేవారు ఇప్పుడు ఒక్కదాంతోనే సర్దుకుపోతున్నారు. క్యాటరింగ్ రంగానిదీ ఇదే పరిస్థితి. కొత్తగా వచ్చే ఆర్డర్లపై ప్లేటుకు రూ.30 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.వసతి భారం హాస్టళ్లపై వాణిజ్య గ్యాస్ ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపుతోంది. సుమారు 12 వేల హాస్టళ్లలో ఉంటున్న 11 లక్షల మంది విద్యార్థులు, ఉద్యోగులు దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత, అధిక ధరలతో పాటు నిత్యావసరాల ధరలు కూడా పెరగడంతో హాస్టళ్ల నిర్వాహకులు భారీ నష్టాల్లో కూరుకుపోయారు. ఈ అదనపు భారాన్ని తట్టుకోలేక ఫీజులు పెంచడంతో పాటు మెనూలో కొంత కోతలు పెడుతున్నారు. -
గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. తగ్గిన ధరలు!
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. ఏప్రిల్ 1 నుంచి గ్యాస్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్లు, 5 కిలోల ఎఫ్టీఎల్ (ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ) సిలిండర్ల రేటుకట్ చేస్తున్నట్లు తెలిపాయి. సవరించిన ధరల ప్రకారం చమురు సంస్థలు 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై రూ.30.50 తగ్గించాయి. దిల్లీలోని ధరల శ్రేణి ప్రకారం కొత్త ధర 1764.50గా నిర్ణయించారు. ముంబయిలో రూ.1719గా ధర ఉంటుంది. చెన్నైలో రూ.1930, కోల్‌కతాలో రూ.1881గా ఉండనుంది. 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ ధరను రూ.7.50కు కట్ చేశారు. అయితే ఈ ధరలను క్రూడ్కంపెనీలు మార్చిలో పెంచిన విషయం తెలిసిందే. మారుతున్న ఇంధన ధరలు, అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ లభ్యత వంటి పరిస్థితుల కారణంగా తాజాగా రేట్లను కట్ చేస్తున్నట్లు కంపెనీలు తెలిపాయి. గృహ వినియోగదారులు వాడే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను యథాతథంగానే 14.2 కేజీకు రూ.855గానే ఉంచినట్లు తెలిసింది. ఇటీవలే ఈ ధరను రూ.955 నుంచి రూ.100 తగ్గించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: సమస్య పరిష్కారానికి ఇరవై గంటల జూమ్‌కాల్ -
చేతులెత్తేసిన శ్రీలంక సర్కార్.. అల్లాడుతున్న లంకేయులు
కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అల్లాడుతోంది. రికార్డు స్థాయికి ద్రవ్యోల్బణం చేరుకోగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పాలపొడి నుంచి లీటర్ పెట్రోల్ వరకు ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం లంక రూపాయి విలువ డాలర్లో పోల్చిచే రూ. 275 ($1 = 275.0000 Sri Lankan rupees)కు చేరుకుంది. దీంతో లంకేయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీలంకలో నిత్యావసర ధరలు అమాంతం పెరిగాయి. ముడి చమురు నిల్వలు అయిపోయిన తర్వాత శ్రీలంక తన ఏకైక ఇంధన శుద్ధి కర్మాగారంలో ఆదివారం కార్యకలాపాలను నిలిపివేసినట్లు పెట్రోలియం జనరల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు అశోక రన్వాలా తెలిపారు. నిత్యావసరాల కోసం కూడా ప్రజలు క్యూలు కట్టే పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 283కు చేరుకోగా, డీజిల్ ధర రూ. 220కి చేరుకుంది. వంట గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ. 1,359 చేరుకుంది. కాగా, వంట గ్యాస్ కొరతతో చాలా హోటళ్లు మూసుకుపోయాయి. గ్యాస్ ధరలు అమాంతం పెరగడంతో ప్రజలు కిరోసిన్ వాడుతున్నారు.ఇక కోడి గుడ్డు ధర రూ. 35, కిలో చికెన్ రూ. 1000, కిలో ఉల్లి ధర రూ. 600, పాలపొడి ప్యాకెట్ ధర రూ. 250, టీ ధర రూ. 100కు చేరుకున్నాయి. ఇదిలా ఉండగా.. పెట్రోల్, డీజిల్ కోసం క్యూలో నిలుచున్న ఇద్దరు వ్యక్తులు ఆదివారం మృతిచెందినట్టు లంక పోలీసులు తెలిపారు. వీరు ఇంధనం కోసం క్యూలైన్లో నిలుచుకొని అస్వస్థతకు గురై చనిపోయినట్టు కొలంబోలో పోలీసు ప్రతినిధి నలిన్ తల్దువా పేర్కొన్నారు. మరోవైపు లంకేయులు విద్యుత్ కొరతను సైతం ఎదుర్కొంటున్నారు. ప్రతీ రోజూ కొన్ని గంటల పాటు కరెంటు సరఫరాను నిలిపివేస్తున్నట్టు సమాచారం. -
దశాబ్ద కనిష్టానికి గ్యాస్ రేటు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దేశీయంగా సహజ వాయువు (నేచురల్ గ్యాస్) ధర దశాబ్దపు కనిష్ట స్థాయికి పడిపోయే అవకాశం ఉన్నట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి. గ్యాస్ ఎగుమతి దేశాల ప్రామాణిక రేట్లను బట్టి చూస్తే మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంబీటీయూ) ధర 1.9–1.94 డాలర్ల స్థాయికి తగ్గొచ్చని, ఇది దశాబ్దంపైగా కనిష్ట స్థాయి. అక్టోబర్1న జరిగే గ్యాస్ ధర సమీక్షలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వివరించాయి. ఎరువులు, విద్యుదుత్పత్తితో పాటు వాహనాల్లో సీఎన్జీగా, వంట గ్యాస్ అవసరాల కోసం ఉపయోగపడే గ్యాస్ రేటును ప్రతి ఆరు నెలలకోసారి (ఏప్రిల్ 1న, అక్టోబర్ 1న) ప్రభుత్వం సమీక్షిస్తుంది. ఓఎన్జీసీకి కష్టకాలం.. అమెరికా, కెనడా, రష్యా వంటి గ్యాస్ మిగులు దేశాల రేట్లను ప్రామాణికంగా తీసుకుని 2014 నవంబర్‌లో ప్రభుత్వం కొత్తగా గ్యాస్ ఫార్ములాను ప్రవేశపెట్టినప్పట్నుంచీ దేశీ క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌పై ఓఎన్జీసీ నష్టాలు చవిచూస్తోంది. బ్రేక్ ఈవెన్ రేటు (లాభ నష్టాలు లేని ధర) 5–9 డాలర్లుగా ఉంటోందని, ప్రస్తుతం నిర్ణయించిన 2.39 డాలర్ల ధర గిట్టుబాటు కాదంటూ కేంద్రానికి ఓఎన్జీసీ ఇటీవలే తెలిపినట్లు సమాచారం. గతంలో గ్యాస్ విభాగంలో నష్టాలను చమురు విభాగం ద్వారా ఓఎన్జీసీ కాస్త భర్తీ చేసుకోగలిగేది. కానీ ప్రస్తుతం చమురు వ్యాపారం కూడా తీవ్ర ఒత్తిడిలో ఉండడం కంపెనీకి ప్రతికూలాంశం. -
కేసు వెనక్కి తీసుకుంటేనే గ్యాస్ రేటుపై స్వేచ్ఛ
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు మెలిక న్యూఢిల్లీ: కఠిన క్షేత్రాల నుంచి వెలికితీసే గ్యాస్ రేటుపై కంపెనీలకు స్వేచ్ఛనిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పటికీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)కు మాత్రం తక్షణ ప్రయోజనం లభించకపోవచ్చు. న్యాయవివాదాల్లో చిక్కుకున్న క్షేత్రాలకు కొత్త ఫార్ములా వర్తించకపోవడమే దీనికి కారణం. చమురు శాఖ అదనపు కార్యదర్శి యూపీ సింగ్ .. క్యాబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించిన సందర్భంగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. గతంలో గ్యాస్ రేటు విషయంలో ఆర్ఐఎల్ ఆర్బిట్రేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో పాటు కేజీ-డీ6లో గ్యాస్ ఉత్పత్తి అంచనాలకు అనుగుణంగా లేనందున వ్యయాలను రికవర్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించకపోవడంపైనా ఆర్బిట్రేషన్‌కు వెళ్లింది. ఈ దరిమిలా తాజా ధర ఫార్ములా ప్రతిపాదనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గ్యాస్ రేటుపై స్వేచ్ఛ ప్రయోజనాలు లభించాలంటే ధర విషయంలో వేసిన పిటీషన్ని వెనక్కి తీసుకుంటే సరిపోతుందని, అన్ని ఆర్బిట్రేషన్లను ఉపసంహరించుకోనక్కర్లేదని చమురు శాఖ వర్గాలు తెలిపాయి. -
దిగుమతి దేశాల గ్యాస్ రేట్లే పరిగణించాలి
భారత్‌లో గ్యాస్ ధర నిర్ణయంపై ఎస్అండ్పీ సూచన న్యూఢిల్లీ: గ్యాస్ రేటును నిర్ణయించ డంలో పుష్కలంగా నిల్వలున్న దేశాలను కాకుండా, తక్కువ నిల్వలుండి దిగుమతి చేసుకునే దేశాలనే ప్రాతిపదికగా తీసుకోవాలని భారత్‌కు రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) సూచించింది. లేకపోతే ధర గిట్టుబాటు కాక... ఇంధన అన్వేషణ కార్యకలాపాల కంపెనీలు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం కష్టమని తెలియజేసింది. గ్యాస్ నిల్వలున్న దేశాల్లో రేట్ల ఆధారంగా ఇటీవలే భారత్ సహజ వాయువు రేటును యూనిట్‌కు 18 శాతం మేర కోత పెట్టి 4.24 డాలర్లకు తగ్గించిన నేపథ్యంలో ఎస్అండ్పీ సూచన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఎగుమతి దేశాల సగటు ప్రకారం.. ప్రస్తుతం మిగులు సహజ వాయువు, మెరుగైన గ్యాస్ రవాణా మౌలిక సదుపాయాలు ఉన్న అమెరికా, కెనడా తదితర దేశాల్లో ధరల ఆధారంగా దేశీయంగా రేట్లను నిర్ణయిస్తున్నారు. అయితే, ఆయా దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పత్తి చాలా తక్కువ కాగా, రవాణా మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా లేవని... ఇలాంటి పరిస్థితుల్లో సదరు దేశాలను ప్రాతిపదికగా తీసుకోవడం సరికాదని ఎస్ అండ్ పీ అభిప్రాయపడింది. ఇప్పటికే ప్రాంతీయంగా ఇతర దేశాలతో పోల్చి చూసినా భారత్‌లో గ్యాస్ రేట్లు తక్కువగానే ఉన్నాయని, థాయ్‌ల్యాండ్, ఇండొనేషియాలో యూనిట్ ధర సగటున 8-10 డాలర్ల మేర ఉందని ఎస్అండ్పీ పేర్కొంది. అటు రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే చమురు, గ్యాస్ బ్లాకుల వేలానికి కూడా పెద్దగా స్పందన లభించకపోవచ్చని కూడా తెలియజేసింది. మరోవైపు, గ్యాస్ ధరలు తక్కువ స్థాయిలో ఉండటం వల్ల ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ ఆదాయం రూ. 1,080-1,150 కోట్లు, ఆయిల్ ఇండియాకు రూ. 120-130 కోట్ల మేర తగ్గవచ్చని మరో రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ పేర్కొంది. -
సబ్సిడీయేతర గ్యాస్ ధర రూ.19 తగ్గింపు
న్యూఢిల్లీ:వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. అంతర్జాతీయ ధరల తగ్గింపుతో 14.2 కేజీల సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.19 తగ్గింది. దీంతో ప్రస్తుతం ఉన్న సిలిండర్ ధర రూ. 920 నుంచి రూ. 901కి తగ్గింది. ఇదిలా ఉండగా డీజిల్ ధరపై మరోసారి భారం మోపారు . తాజాగా డీజిల్ ధర స్థానిక పన్నులో పెరుగుదల కలుపుకుని రూ. 57 పైసలు పెరిగి, లీటరుకు రూ. 58.40 నుంచి రూ.58.97కు పెరిగింది. అయితే పెట్రోల్ ధర లీటర్‌పై రూ.1.51 పైసలు తగ్గింది. ఈ సవరించిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు రేట్లు తగ్గడంతో పెట్రోల్‌పై రూ.1.51 తగ్గించామని, స్థానిక అమ్మకం పన్నుల్లో తగ్గింపు కూడా కలుపుకుంటే ఢిల్లీలో తగ్గింపు రూ.1.81కి చేరిందని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తెలిపింది.


