Srilanka Economic Crisis: అల్లాడుతున్న లంకేయులు.. టీ, పెట్రోల్‌, గ్యాస్‌, చికెన్‌ రేటు ఎంతో తెలుసా..?

Economic Crisis Worsens In Sri Lanka - Sakshi

కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అల్లాడుతోంది. రికార్డు స్థాయికి ద్రవ్యోల్బణం చేరుకోగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పాలపొడి నుంచి లీటర్‌ పెట్రోల్‌ వరకు ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం లంక రూపాయి విలువ డాలర్‌లో పోల్చిచే రూ. 275 ($1 = 275.0000 Sri Lankan rupees)కు చేరుకుంది. దీంతో లంకేయులు తీవ్ర ఇబ‍్బందులు ఎదుర్కొంటున్నారు. 

శ్రీలంకలో నిత్యావసర ధరలు అమాంతం పెరిగాయి. ముడి చమురు నిల్వలు అయిపోయిన తర్వాత శ్రీలంక తన ఏకైక ఇంధన శుద్ధి కర్మాగారంలో ఆదివారం కార్యకలాపాలను నిలిపివేసినట్లు పెట్రోలియం జనరల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు అశోక రన్‌వాలా తెలిపారు. నిత్యావసరాల కోసం కూడా ప్రజలు క్యూలు కట్టే పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్‌ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. అక్కడ లీటర్‌ పెట్రోల్ ధర రూ. 283కు చేరుకోగా, డీజిల్‌ ధర రూ. 220కి చేరుకుంది. వంట గ్యాస్‌ సిలిండర్ ధర ఏకంగా రూ. 1,359 చేరుకుంది. కాగా, వంట గ్యాస్ కొరతతో చాలా హోటళ్లు మూసుకుపోయాయి. గ్యాస్‌ ధరలు అమాంతం పెరగడంతో ప్రజలు కిరోసిన్‌ వాడుతున్నారు.ఇక కోడి గుడ్డు ధర రూ. 35, కిలో చికెన్‌ రూ. 1000, కిలో ఉల్లి ధర రూ. 600, పాలపొడి ప్యాకెట్‌ ధర రూ. 250, టీ ధర రూ. 100కు చేరుకున్నాయి. 

ఇదిలా ఉండగా.. పెట్రోల్‌, డీజిల్‌ కోసం క్యూలో నిలుచున్న ఇద్దరు వ్యక్తులు ఆదివారం మృతిచెందినట్టు లంక పోలీసులు తెలిపారు. వీరు ఇంధనం కోసం క్యూలైన్‌లో నిలుచుకొని అస్వస్థతకు గురై చనిపోయినట్టు కొలంబోలో పోలీసు ప్రతినిధి నలిన్ తల్దువా పేర్కొన్నారు. మరోవైపు లంకేయులు విద్యుత్‌ కొరతను సైతం ఎదుర్కొంటున్నారు. ప్రతీ రోజూ కొన్ని గంటల పాటు కరెంటు సరఫరాను నిలిపివేస్తున్నట్టు సమాచారం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top