సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాలను ఒడిసి పట్టి.. ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకుని.. కరవు నేలను సుభిక్షం చేసే దిశగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. గోదావరి వరద జలాలను కరవు నేలకు మళ్లించడానికి అనేక రకాలుగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా మరో ప్రతిపాదనపై దృష్టి పెట్టింది. పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారు చేయిస్తోంది. గోదావరి నది నుంచి సముద్రంలో కలిసిపోతున్న వరద జలాల్లో రోజుకు 23 వేల క్యూసెక్కుల చొప్పున అంటే 2 టీఎంసీల నీటిని.. 105 రోజులపాటు తరలించి.. మొత్తంగా 210 టీఎంసీలను ఒడిసి పట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన. తద్వారా నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టులోని 9.61 లక్షల ఎకరాలను స్థిరీకరించాలని, నాగార్జునసాగర్ రెండో దశలో భాగంగా ప్రకాశం జిల్లాలోని దర్శి, కనిగిరి నియోజకవర్గాల్లో మరో 2 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం కల్పించాలని భావిస్తోంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలను ఈ ప్రాజెక్టు ద్వారా తీర్చాలని యోచిస్తోంది.