రాష్ట్ర విభజన విషయంలో డబుల్ స్టాండ్తో ఉన్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సీమాంధ్రలో అడుగుపెట్టే అర్హతలేదని వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. కృష్ణుడు గెటప్స్తో డ్రామాలు అడేది టిడిపి నేతలేనని విమర్శించారు. విభజన ప్రక్రియకు ముందు రోజు టిడిపి నేతలు కాంగ్రెస్ నేతలతో మాట్లాడలేదా? అని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు సమైక్యవాదో, తెలంగాణ వాదో, అవకాశవాదో టీడీపీ నేతలు తెలపాలన్నారు. సీమాంధ్రలో అడుగుపెట్టేముందు చంద్రబాబు తన వైఖరేంటో స్పష్టం చేయాలని అంబటి డిమాండ్ చేశారు. ఆత్మగౌరవ యాత్ర చేసే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. వైఎస్ విజయమ్మ ఢిల్లీ పర్యటనపై టీడీపీ నేతలు అవాకులు,చెవాకులు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబుకు కాంగ్రెస్ పెద్దలతో నేరుగా సంబంధాలే ఉన్నప్పుడు అపాయింట్‌మెంట్లు ఎందుకు? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పదవి రాకముందు యనమల రామకృష్ణుడు వైఎస్‌ఆర్ సీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేశారని చెప్పారు. రాష్ట్రం రావణకాష్టంలా మారితే చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో చలికాచుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు చరిత్రహీనుడైతే, వైఎస్ జగన్ చరిత్ర వీరుడవుతాడని తెలిపారు. తెలుగు ప్రజల కోసం జగన్ 4 రోజులుగా దీక్ష చేస్తున్నారన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు బాడీ లాంగ్వేజ్ తప్ప ఏ లాంగ్వేజ్ చేతకాదన్నారు. గాంధీభవన్‌ను బ్రాందీభవన్‌గా మార్చిన ఘనత బొత్సదన్నారు. సమన్యాయం అంటే బొత్స సత్యనారాయణకు ఏం తెలుసునని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సమన్యాయం అంటే ఒక ప్రాంతం వారు గెలిచినట్లు, మరొక ప్రాంతంవారు ఓడినట్లు కాకుండా అందరూ సంతోషంగా విడిపోయేటట్లు ఉండాలని వివరించారు.