రమణమ్మ.. నీదెంత పెద్ద మనసమ్మా! | inspirational person ramanamma | Sakshi
Sakshi News home page

Jun 4 2014 7:48 PM | Updated on Mar 22 2024 10:55 AM

అనుకున్నది సాధించాలంటే ఎంతో ఆత్మవిశ్వాసం... అంతకుమించి దాన్ని సాధించేందుకు ధృడ సంకల్పం అవసరం. సమాజానికి సేవ చేయాలంటే ఎంతో పెద్దమనసు కావాలి. బతుకుదెరువు కోసం చిరువ్యాపారం చేసుకునే ఓ వృద్ధురాలు తోటి ప్రజల కోసం తను కూడబెట్టినదంతా కరిగించింది. సేవ చేయాలంటే అధికారమో, డబ్బో అవసరంలేదని సాటి మనిషికి సాయమందించాలనే తాపత్రయం ఉంటే చాలని చాటిచెప్పింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బర లంకలో నివసించే రమణమ్మ... చిరుతిళ్లు, గుగ్గిళ్లు, ఒడియాలు అమ్ముకుంటూ జీవిస్తోంది. భర్త వదిలేయడంతో అక్క, తమ్ముళ్లతో కాలం వెళ్లదీసేది. ఒక్కరోజూ చేసే పనికి దూరమయ్యేది కాదు రమణమ్మ. చిన్న సంఘటనతో తమ్ముడు ఆమెను విడిచి ఎక్కడికో వెళ్లిపోయాడు. తమ్ముడికోసం ఏళ్ల తరబడి ఎదురు చూసింది. అతడు మాత్రం తిరిగిరాలేదు, ఏమయ్యాడో తెలియలేదు. ఎండైనా...వానైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా గుగ్గిళ్లు, ఒడియాలు అమ్మడం మానలేదు రమణమ్మ. రాజమండ్రిలోని గౌతమీ జీవకారుణ్య సంఘానికి విరాళంగా ఇస్తే... పిల్లలకు భోజనం పెడతారని ఎవరో చెప్పారామెకు. తాను కూడబెట్టిన డబ్బులో 30వేలు ఆ సంస్థకు విరాళంగా ఇచ్చేసింది. గ్రామంలో చిరుతిళ్లు అమ్మే వృద్ధురాలు 30 వేలు ఓ సంస్థకు విరాళం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రమణమ్మ ఆశయం అక్కడితో ఆగిపోలేదు. మళ్లీ రూపాయి, రూపాయి కూడబెట్టడం మొదలు పెట్టింది. లక్షరూపాయలు వరకూ కూడబెట్టింది. గ్రామపెద్దను కలిసి, ఊళ్లో బస్టాపు నిర్మించాలని కోరింది. ఆమె ఆశయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. రెక్కలు ముక్కలు చేసుకుని తమ కళ్లముందు కష్టపడిన వృద్ధురాలు గ్రామానికి చేస్తున్న సహాయం చూసి చలించిపోయారు. ఆమె కోరిక మేరకు ఒక్క పైసా వృథా కాకుండా గ్రామంలో బస్టాప్ నిర్మించారు. జీవితమంతా కష్టపడి సంపాదించిన సొమ్ముతో నిర్మించిన బస్టాండుకు తాను ఎంతగానో అభిమానించిన తమ్ముడి పేరు పెట్టుకుంది రమణమ్మ. జీవిత చరమాంకంలో తనకుంటూ పైసా కూడా ఉంచుకోకుండా గ్రామంకోసం ఖర్చుపెట్టడంపై ఆనందంవ్యక్తం చేస్తోంది. ఎండలో ప్రయాణికులు ఇబ్బందిపడకుండా ఉండేందుకే బస్ షెల్టర్ ఏర్పాటు చేశానని చెపుతోంది. ఏడుపదులు పైబడిన వయసులోనూ రమణమ్మ తన పనులు తానే చేసుకుంటోంది. ఒంటరిగా జీవిస్తూ గ్రామంలో తిరుగుతూ చిరుతిళ్లు అమ్ముతూనే ఉంది. ప్రభుత్వం నుంచి పెన్షన్ వస్తుంది కదా ఎందుకింకా కష్టపడతావని ఆమెను అడిగితే ఒకటే సమాధానం చెపుతుంది. పని చేయడం తనకు అలవాటని డబ్బు కూడపెడితే మరో మంచి పనికి ఆవి పనికి వస్తాయంటోంది. ఆమె ఆశయానికి గ్రామస్థులు కూడా సహకరిస్తున్నారు. ఏ ఆధారం లేని ఆ వృద్ధురాలికి అండగా ఉంటున్నారు. ఎదుటివారికి సహాయం చేయాలనే ఆలోచన ఏ కొద్దిమందికో ఉంటుంది. ఆలోచన వచ్చినా ఆచరణలో ఎందుకొచ్చిన కష్టంలే అని వదిలేసేవారే ఎక్కువమంది. కానీ వయసు మీదపడుతున్నా శరీరం సహకరించకున్నా ఇతరుల కోసం జీవితం ధారపోసే రమణమ్మలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. అలాంటి వారికి ఆమె ఆదర్శనమడంలో సందేహం లేదు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement