ముఖ్యమంత్రి పదవి చేపట్టి వాగ్దానాలను నెరవేర్చాల్సిన శుభ సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోపించారు. 'ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చంద్రబాబు నెరవేర్చాల్సినవి చాలా ఉన్నాయన్నారు. వ్యవసాయ, చేనేత, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామన్నారు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు పెంచుతానన్నారు. వాటిని ఎప్పుడు నెరవేరుస్తారా అని ప్రజలు ఆశతో ఉన్నారు' అని మేకపాటి అన్నారు. 'పార్టీలు మారడం తప్పుకాదు, నేను కూడా కాంగ్రెస్ నుంచి వచ్చి రాజీనామా చేశాను. ఆతర్వాత మళ్లీ పోటీచేసి గెలుపొందాను. ఫలితాలు వచ్చి 9 రోజులు కాకముందే పార్టీలు మారుతున్నారు. పార్టీ మారాలనుకుంటే... ముందు పార్టీకి, పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తే నైతికంగా ఉంటుంది' అని మేకపాటి తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన తొమ్మిది రోజుల్లోనే పార్టీ మారడం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమేనని ఆయన అన్నారు. పార్టీ మారిన వారందరిపైనా ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందని మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెలుగుదేశం పార్టీలోకి చేరడంపై మేకపాటి అసంతృప్తిని వ్యక్తం చేశారు.