వరుసపెట్టి ఆరు సెషన్ల నుంచి నీరసిస్తూనే ఉన్న రూపాయి.. శుక్రవారం నాడు కొద్దిగా కోలుకుంది. 25 పైసలు పెరిగి, ఉదయం నాటి ట్రేడింగ్లో 64.30 వద్ద ట్రేడయింది. తర్వాత మళ్లీ నీరసించి 17 పైసలు పడిపోయి ఉదయం 10.30 గంటల సమయానికి 64.47 వద్ద ట్రేడవుతూ వచ్చింది. అనవసరంగా ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్థికమంత్రి పి.చిదంబరం చెప్పిన మాటలు ఇన్వెస్టర్ల నమ్మకాన్ని కొంతమేర పెంచడంతో ఉదయం రూపాయి కోలుకుంది. దాంతోపాటు, కొన్ని విదేశీ కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలహీనపడటం, రిజర్వు బ్యాంకు వద్ద తగినంత మొత్తంలో విదేశీ మారకద్రవ్యం ఉందని బ్యాంకు గవర్నర్ దువ్వూరి సుబ్బారావు హామీ ఇవ్వడం రూపాయి బలపడటానికి ప్రధాన కారణాలుగా కనిపించాయి. గురువారం నాటి ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజి మార్కెట్లో ఇంట్రాడే కనిష్ఠం 65.56 వరకు వెళ్లి, చివరకు 44 పైసలు నష్టపోయి 64.55 వద్ద క్లోజయింది. రూపాయి బలపడినా, ఆ సెంటిమెంటు మాత్రం బీఎస్ఈ సెన్సెక్స్కు పెద్దగా ఉపయోగపడలేదు. శుక్రవారం ఉదయం 61.96 పాయింట్ల నష్టంతో 18,250.98 పాయింట్లతో మార్కెట్ ప్రారంభమైంది.