పులిచెర్ల(కల్లూరు): అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో ఎక్కడ లేని విధంగా పులిచెర్ల మండలంలో ఏనుగుల సమస్య పరాకాష్టకు చేరింది. గత రెండేళ్లుగా ఇక్కడ ఏదో ఒక గ్రామంలో ఏనుగుల గుంపు తిష్ఠ వేస్తూనే ఉంది. ఎందరో అధికారులు వచ్చి వీటిని వేరే ప్రాంతానికి తరలించాలని చూస్తున్నా.. గజరాజులు మాత్రం పులిచెర్ల సరిహద్దులు దాటడం లేదు. చుట్టూ దట్టమైన అడవి ఉండటంతో.. పగలంతా అడవుల్లో ప్రశాంతంగా సేదతీరుతున్న ఏనుగులు, చీకటి పడగానే పొలాలపై పడి బీభత్సం సృష్టిస్తున్నాయి.
మామిడి తోటలే వాటికి ‘మధురాహారం’
పులిచెర్ల మండలంలో విస్తారంగా మామిడి తోటలు ఉండటమే ఈ సమస్యకు ప్రధాన కారణంగా మారింది. ఏనుగులకు ఇక్కడ ఆహారం సులభంగా, పుష్కలంగా దొరుకుతోంది. ముఖ్యంగా సీజన్ వచ్చిందంటే చాలు.. మామిడి తోపుల్లో చేరి, కాయలను తినడమే కాకుండా ఎంతో కాలంగా పెంచిన పెద్ద పెద్ద కొమ్మలను సైతం విరిచేస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకున్న చెట్లు కళ్ల ముందే విరిగిపోతుంటే రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీనికి తోడు నెమళ్ల గుంపులు కూడా తోటలపై పడి పంటను నాశనం చేస్తున్నాయి.


