కొండాపురం : గండికోట జలాశయం నుంచి పైడిపాళెం జలాశయం, కమలాపురానికి తాగు, సాగునీటి ఆవసరాలకు కృష్ణజలాలు తరలిస్తునట్లు ఆదివారం జీఎన్‌ఎస్‌ఎస్ ఈఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ శెట్టివారిపల్లె రెగ్యూలెటర్ ఎత్తి గాలేరి నగరి సృజల స్రవంతి మొయిన్ కెనాల్ ద్వారా 250 క్యూసెక్కుల నీరు రెండు వారాలుగా వెళుతోందన్నారు. గండికోట ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా గండికోట జలాశయంలో ప్రస్తుతం 18 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. గండికోట జలాశయం నుంచి గండికోట లిఫ్ట్ ఇరిగేషన్–1 నుంచి నాలుగు భారీ మోటర్ల ద్వారా పైడిపాళెం జలాశయానికి 440 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నామన్నారు.
ముద్దనూరు : ముద్దనూరు–తాడిపత్రి జాతీయ రహదారిపై శెట్టివారిపల్లె సచివాలయం వద్ద ఆదివారం బైక్‌ను ఆటో ఢీకొట్టడంతో ఇద్దరు గాయపడ్డారు. బైక్‌పై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆటో ఢీకొంది. స్థానికులు వెంటనే ఇద్దరినీ 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి వివరాలు తెలియరాలేదని స్థానికులు తెలిపారు.
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల మండల పరిధిలోని నిడుజివ్వి గ్రామం నాపరాయి గనిలో జరిగిన ట్రాక్టర్ బోల్తా ప్రమాదంలో గాయపడిన నిల్సన్‌బాబు (51) కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ అదివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కలమల్ల గ్రామానికి చెందిన నిల్సన్‌బాబు ఈ నెల 17న నిడుజివ్వి నాపరాయి గనుల్లోకి పనికి వెళ్లారు. ట్రాక్టర్ బోల్తా పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను వెంటనే చికిత్స కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ నిల్సన్ బాబు మృతి చెందినట్లు ఎస్‌ఐ రామాజంనేయులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
– దంపతులకు తీవ్ర గాయాలు
పోరుమామిళ్ల : పోరుమామిళ్ల – బద్వేలు రోడ్డు చెన్నారెడ్డిపేట సమీపంలో ఆదివారం బైక్‌ను కారు ఢీకొట్టడంతో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. పొలం నుంచి బైక్‌పై ఇంటికి వెళుతున్న వెంకటరమణ, రామతులసి దంపతులను శ్రీశైలం నుంచి బద్వేలు వెళుతున్న కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.


