● ప్రపంచ మార్కెట్‌లో
మరింత గుర్తింపు తీసుకురావాలి
● కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
లింగాల/పులివెందుల టౌన్/ పులివెందుల రూరల్/ చెన్నూరు: లింగాల మండలం కోమన్నూతల అరటి సాగు నాణ్యత, ఉత్పత్తి, మార్కెటింగ్‌పరంగా దేశానికే కాకుండా ప్రపంచ స్థాయిలో ఆదర్శంగా నిలిచేలా రైతులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ శ్రీధర్ పిలుపునిచ్చారు. పులివెందుల నియోజకవర్గ పర్యటనలో భాగంగా బుధవారం కలెక్టర్ లింగాల మండలం కోమన్నూతల గ్రామాన్ని సందర్శించి, అక్కడ విస్తారంగా సాగవుతున్న అరటి తోటలను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి పంట సాగు, దిగుబడులు, మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలు, ఎదురవుతున్న సవాళ్లపై సమగ్రంగా చర్చించారు. దేశంలోనే విశిష్ట గుర్తింపు పొందిన కోమన్నూతల అరటి పంట జిల్లాకు గర్వకారణమని అన్నారు. ఉద్యాన పంటల అభివృద్ధిలో ఈ గ్రామం ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని, జిల్లాతో పాటు రాష్ట్ర స్థూల విలువ ఆధారిత ఉత్పత్తి (జీవీఏ)లో అరటి సాగు కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఇక్కడ పండే అరటికి దేశీయ మార్కెట్‌తోపాటు విదేశీ మార్కెట్లలో కూడా మంచి ఆదరణ ఉందని, ఆ అవకాశాలను మరింత విస్తరించే దిశగా అధికారులు కార్యాచరణ రూపొందించాలన్నారు. రైతులు సంఘటితంగా ముందుకు వచ్చి బలమైన ఎఫ్‌పీఓలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి హరిప్రసాద్, ఉద్యానశాఖ సహాయ సంచాలకుడు రవిచంద్ర బాబు, ఉద్యాన అధికారి బి.దీప, అరటి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శిరీష పాల్గొన్నారు.
మత్తుకు యువత దూరంగా ఉండాలి
మత్తుకు యువత దూరంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక రమణప్ప సత్రంబడి లో కలెక్టర్‌ను స్నేహిత అమృతహస్తం సేవా సమితి అధ్యక్షుడు రాజు కలిసి మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన పోస్టర్లను ఆవిష్కరింపజేశారు.
ప్రతి పాఠశాల స్మార్ట్ కిచెక్ పరిధిలోకి ...
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ప్రతి మండలాన్ని స్మార్ట్ కిచెన్ పరిధిలోకి తీసుకొస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. బుధవారం పులివెందుల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో, రమణప్ప సత్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, చెన్నూరు మండలం కొండపేటలోని స్మార్ట్ కిచెన్‌లను పరిశీలించారు. భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 25స్మార్ట్ కిచెన్ పాయింట్లను ఏర్పాటు చేశామని వారం, పదిరోజుల్లో మరో 13 ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
పనులను వేగవంతం చేయండి
జల జీవన్ మిషన్ కింద జరుగుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఇరిగేషన్, పీబీసీ, మున్సిపల్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి
కడప సెవెన్‌రోడ్స్ : యువతలో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మై భారత్ కార్యక్రమాలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సంబంధిత శాఖల నోడల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ‘మై భారత్ (ఎంవై–డీఏసీ) జిల్లా సలహా కమిటీ’ తొలి సమావేశం జరిగింది. మై భారత్ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తరించడం తదితర అంశాలపై కార్యాచరణ రూపొందించడంతోపాటు అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.


