● స్మార్ట్ కిచెన్ ద్వారా
భోజనం సరఫరా ఆలస్యం
● రెండు గంటల పాటు ఆకలితో
అలమటించిన విద్యార్థులు
బద్వేలు అర్బన్ : పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన సుమారు 1500 మంది విద్యార్థులు బుధవారం ఆకలితో అలమటించారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ కిచెన్ విధానంలో భాగంగా కేంద్రీకృత వంటశాల నుండి ఆయా పాఠశాలలకు సరఫరా చేసే భోజనం సుమారు రెండు గంటల పాటు ఆలస్యం కావడంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. మండల పరిధిలో 5 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 4 మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, 55 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 3580 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలలకు ఏపీ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ కిచెన్ ద్వారా డొక్కాసీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పంపిణీ చేసేందుకు చిన్నకేశంపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో స్మార్ట్ కిచెన్ నిర్మించారు. ఆయా పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు మూడు రూట్లను విభజించి మూడు వాహనాలను ఏర్పాటు చేశారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1410 మంది విద్యార్థులు ఉండగా 1156 మంది, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 430 మంది విద్యార్థినులకు 365 మంది చొప్పున మొత్తం 1521 మంది బుధవారం ఆయా పాఠశాలలకు హాజరయ్యారు. వీరికి మధ్యాహ్నం 12–15 గంటల నుంచి భోజనం అందించాల్సి ఉంది. మండల పరిధిలోని పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తగినంత భోజనం సరఫరా చేసే వాహనాలు లేకపోవడంతో జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు మధ్యాహ్నం 2 గంటలకు, జెడ్పీ బాలికల ఉన్నర పాఠశాలకు 2–15 గంటలకు దాదాపు రెండు గంటలు ఆలస్యంగా భోజనం అందింది. దీంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. పాఠశాల ఉపాధ్యాయులు సైతం భోజనం చేయకుండా విద్యార్థులను పర్యవేక్షిస్తుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న భవిత కేంద్రంలోని 20 మంది విద్యార్థులు సైతం ఆకలితో అలమటించారు. జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.వెంకటసుబ్బారెడ్డి భోజనం ఆలస్యమైన విషయా న్ని సంబంధిత ఎంఈఓ, తహసీల్దారు, ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్ళారు. దాదాపు రెండు గంటలు భోజనం ఆలస్యంగా రావడంతో విద్యార్థులు ఆకలితో అలమటించడంతో పాటు మధ్యాహ్నం సెషన్‌లో జరగాల్సిన మొదటి పిరియడ్‌ను కోల్పోవాల్సి వచ్చింది.


