మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా
కడప సెవెన్ రోడ్స్: కడప నగరం బుడ్డాయపల్లెలో 2.11 ఎకరాల రామాలయ భూములను అధికార టీడీపీకి చెందిన జి. వెంకటనాథరెడ్డి తప్పుడు రికార్డులు సృష్టించి విక్రయిస్తూన్నారని, ఎంతో విలువైన ఈ దేవదాయ శాఖ భూములను కాపాడాలని మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా కోరారు. సోమవారం డీఆర్వో మల్లిఖార్జునుడుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కబ్జాలు, దందాలు పెరిగిపోయాయన్నారు. చివరకు దేవుని భూములు సైతం వదలడం లేదన్నారు. బుడ్డాయపల్లెలో టీడీపీ నాయకుడు దొంగ డాక్యుమెంట్లతో ఆలయ భూములు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా రెవెన్యూ శాఖ ప్రజలకు నోటీసులు కూడా ఇచ్చిందన్నారు. ప్రతి ఏటా దేవదాయ శాఖ ఆ భూములకు వేలం పాటలు నిర్వహిస్తోందన్నారు. తద్వారా వచ్చిన డబ్బు దేవదాయ శాఖకు వెళుతోందన్నారు. అయితే ఆ భూములు తమవిగా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆన్‌లైన్‌లోని మార్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. జాయింట్ కలెక్టర్, కోర్డు ఇచ్చిన ఉత్తర్వులను కూడా అధికారులు అమలు చేయకపోవడం విచారకరమన్నారు. ఎండోమెంట్ అధికారులు కబ్జాదారులతో కుమ్మకై కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడం వల్ల దేవదాయ ఆస్తులు, ఎక్స్ పార్టీకి వెళ్ళిపోతున్నాయని ఆరోపించారు. ఇప్పటికై నా అధికారులు స్పదించి ఆలయ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు.
ఏసీపై ప్రజల ఆగ్రహం......
దీనిపై డీఆర్వో స్పందిస్తూ దేవదాయ శాఖ ఆసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీని పిలిపించి ఆరా తీశారు. ఈ సందర్బంగా శంకర్ బాలాజీ మాట్లాడుతూ పోలీసు కేసు పెట్టాలంటూ ప్రజలకు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో ఒక సారిగా గ్రామస్తులు ఏపీ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండో మెంట్ భూములను రక్షించలేనప్పుడు బదిలీపై వెళ్ళిపోవాలంటూ ఏసీపై విరుచుకుపడ్డారు. డీర్వో జోక్యం చేసుకొని ఆ భూములు దేవదాయ శాఖవే కనుక వాటిని రక్షించుకోవాల్సిన అవసరం కూడా ఆశాఖ అధికారులపైనే ఉంటుందన్నారు. టీడీపీ నేత సృష్టించినట్లుగా చెబుతున్నవి తప్పుడు డాక్యుమెంట్లు అని తేలితే వాటిని రద్దు చేయాలని జిల్లా రిజిస్ట్రార్‌ను అదేశించారు. దీనిపై రిమ్స్ ఏవో రంగస్వామి, ఎండోమెంట్ ఏసీ శంకర్ బాలాజీ, జిల్లా రిజిస్ట్రార్ విచారణ నిర్వహించాలని అదేశించారు. ఈ కార్యక్రమంలో బుడ్డాయపల్లె గ్రామస్తులతో పాటు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు షఫీ, యానాదయ్య, రమేష్‌రెడ్డి, శ్రీరంజన్‌రెడ్డి, బంగారు నాగయ్య, రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


