కడప రూరల్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ యుగంధర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా పని చేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో అన్ని ఆరోగ్య కార్యక్రమాలు అభివృద్ధి జరగాలని, వంద శాతం లక్ష్యం దిశగా సిబ్బంది పనిచేసి, రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో ఉంచాలని తెలిపారు. జిల్లా ఎయిడ్స్, లెప్రసీ అధికారి డాక్టర్ రవిబాబు, ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ప్రవీణ్, కోఆర్డినేటర్ డాక్టర్ ఆరిఫుల్లా, నేషనల్ హెల్త్ మిషన్ కోఆర్డినేటర్ డాక్టర్ మహమ్మద్ తాహా, డెమో భారతి, కుమారి, ఏఓ జయభాస్కర్ తదితరులు యుగంధర్‌కు శుభాకాంక్షలు తెలియ చేశారు.
‘తల్లికి వందనం’ కోసం
ఎన్‌పీసీఐ లింక్ చేసుకోవాలి
కడప రూరల్ : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివే ఎస్సీ వర్గానికి చెందిన విద్యార్థులకు తల్లికి వందనం పథకం నిధులు విద్యార్థి బ్యాంకు ఖాతాకు జమ అవుతాయని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం చింతామణి పేర్కొన్నారు. విద్యార్థులు తమ బ్యాంకు ఖాతాను తప్పనిసరిగా ఎన్‌పీసీఐకు లింక్ చేసుకోవాలని తెలిపారు. ఎస్సీ విద్యార్థుల 1,349 మంది ఖాతాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. వెంటనే సమీప పోస్టాఫీసుకు వెళ్లి, ఐపీపీబీ ఖాతాను తెరచి ఆధార్ నంబర్‌కు ఎన్‌పీసీఐ పోర్టల్‌కు లింక్ చేసుకోవాలన్నారు. ఒకవేళ ఇదివరకే బ్యాంకు ఖాతా ఉంటే ఆ నంబరుకు ఎన్‌పీసీఐకు లింక్ చేసుకోవాలని తెలిపారు. ఇలా చేస్తేనే తల్లికి వందనం నిధులు ఎస్సీ విద్యార్థుల ఖాతాలకు జమవుతాయని పేర్కొన్నారు.
స్థానిక కేడర్లకు
ఉద్యోగుల కేటాయింపు
కడప సెవెన్‌రోడ్స్ : స్థానిక కేడర్ల ఏర్పాటు, ఉద్యోగుల కేటాయింపు పారదర్శకంగా అమలు చేయాలని డీఆర్వో మల్లికార్జునుడు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అన్నమయ్య జిల్లా డీఆర్వో చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి అన్నిశాఖల హెచ్‌ఓడీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమలు, పురోగతి, జాబ్ క్యాలెండర్ ఫేజ్–2 కింద చేపట్టాల్సిన నియామకాలపై అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఉత్తర్వులు 2025 ప్రకారం ఉద్యోగులను కొత్త స్థానిక కేడర్లకు కేటాయించే ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా జరగాలన్నారు. ఉద్యోగుల కేటాయింపు కోసం ప్రభుత్వం జిల్లా శాఖాధిపతి, సచివాలయ స్థాయిల్లో అమలు కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు. జిల్లా స్థాయి అమలు కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారన్నారు. సేవా రికార్డుల ఆధారంగా ముసాయిదా సీనియారిటీ జాబితాలను సిద్ధం చేసి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది జాబితా ప్రకటించాల్సి ఉంటుందన్నారు. తుది కేటాయింపు జాబితా విడుదల తర్వాత అవసరమైన బదిలీ ఉత్తర్వులు జారీ చేసి నిర్ణీత గడువులోపు ఉద్యోగులు కొత్త స్థానిక కేడర్ విధుల్లో చేరేలా చూస్తామన్నారు. కలెక్టరేట్ ఏఓ గంగయ్య, కడప, అన్నమయ్య జిల్లాల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.


