నువ్వెంత.. నీ బతుకెంత ! | - | Sakshi
Sakshi News home page

నువ్వెంత.. నీ బతుకెంత !

May 26 2026 3:02 AM | Updated on May 26 2026 3:02 AM

బీటెక్‌ రవిపై విరుచుకుపడ్డ

ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి

టీడీపీ దుష్ప్రచారంపై

కట్టలు తెంచుకున్న ఆవేశం

సాక్షి ప్రతినిధి, కడప: పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్న పచ్చ మూకలపై ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి విరుచుకుపడ్డారు. ముఖ్యంగా పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్‌ బీటెక్‌ రవిపై మండిపడ్డారు. ‘నువ్వెంత.. నీ బతుకెంత’ అని తీవ్రస్థాయిలో దునుమాడారు. అజాతశత్రువుగా, సౌమ్యుడిగా పేరుగాంచిన ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిలో ఎన్నడూ లేనంతగా ఆవేశం కట్టలు తెంచుకుంది. సోమవారం పులివెందుల వైఎస్సార్‌సీపీ బూత్‌ లెవెల్‌ కార్యకర్తల సమావేశంలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ విపక్షనేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దగా సీఎం చంద్రబాబు జవాబు చెప్పకపోగా, గొడ్డలి పార్టీ అంటూ నిత్యం శ్రేణులకు స్క్రిప్ట్‌ పంపించి దుష్ప్రచారం చేయడంపై రగిలిపోయారు. అమరావతిలో అవినీతిపై ఆరోపణలు చేస్తే చిత్తశుద్ధితో నిరూపించుకోవాల్సింది పోయి.. వైఎస్‌ కుటుంబం టార్గెట్‌గా దుష్ప్రచారం చేయిస్తుండడంపై ఎంపీ ధ్వజమెత్తారు.

బీటెక్‌ రవీ.. నోరు జాగ్రత్త!

‘బైరెటీస్‌, ఇసుక దోపిడీతో అక్రమార్జన చేస్తున్న నువ్వెంత, నీబతుకెంత...అలాంటి నువ్వు మా నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడేవాడివా? నోరు జాగ్రత్త’ అంటూ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా, రూ.12కోట్లు ఇవ్వాలని పార్టీలో చేర్చుకోవాలంటూ రాయబేరం నడిపారని ధ్వజమెత్తారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బీటెక్‌ రవి సిద్ధహస్తుడని రూఢీ చేశారు. పులివెందుల మెడికల్‌ కళాశాలను నిర్వీర్యం చేస్తే ఆప్రాంత ప్రతినిధిగా సీఎం దృష్టికి తీసుకెళ్లి మెడికల్‌ కళాశాల కొనసాగిస్తే ప్రజల మద్దతు పొందే అవకాశం ఉంది. అలా కాకుండా రాజకీయ మనుగడ కోసం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్‌గా చేసుకొని మాట్లాడడం ఏమేరకు సహేతుకమని ప్రశ్నించారు. చేయాల్సిన మంచి పనులు చేయకపోగా వైఎస్‌ కుటుంబం టార్గెట్‌గా టీడీపీ వ్యవహరిస్తోన్న తీరుకు ప్రజలు సైతం మండిపడుతున్నారు.

శివారెడ్డి హత్య కేసు నిందితులు

టీడీపీలోనే...

మాజీ మంత్రి పొన్నపురెడ్డి శివారెడ్డి హత్య వైఎస్‌ కుటుంబమే కారణమని బీటెక్‌ రవి దుష్ప్రచారం చేశారు. వాస్తవానికి దేవగుడి కుటుంబంతో ఉన్న ఫ్యాక్షన్‌ కారణంగా శివారెడ్డి హత్య చోటుచేసుకుంది. జిల్లాలో ఎవర్ని అడిగినా ఇట్టే సమాధానం చెబుతారు. కేసులో ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణరెడ్డితో సహా సోదరులు నిందితులుగా ఉన్నారు. వారంతా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యులే. పాతతరం నేతలకు జిల్లా వాసులకు ఇదంతా తెలిసిందే. దుష్ప్రచారం కోసం ఎల్లోబ్యాచ్‌ అండగా ఉన్న నేపఽథ్యంలోనే తెలుగుతమ్ముళ్లు తప్పుడు ప్రచారాన్ని ఎంచుకున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. గురివింద గింజ సామెతను గుర్తు చేస్తూ టీడీపీ నేతలు గుండ్లకుంట శివారెడ్డి, పరిటాల రవీంద్ర హత్యలు తెరపైకి తెస్తున్నారని పలువురు వివరిస్తున్నారు. ఇరువురి హత్యలో ఆరోపణలు ఎదుర్కొన్న దేవగుడి కుటుంబం, జేసీ కుటుంబం తెలుగుదేశం పార్టీ ఉన్న విషయాన్ని గుర్తురెగకపోవడంపై విశ్లేషకులు సైతం నిలదీస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement