వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి
జమ్మలమడుగు : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సర్ కార్యక్రమంలో బూల్ లెవెల్ ఏజెంట్లే (బీఎల్‌ఏ) కీలకమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అధ్యక్షతన సర్‌పై బీఎల్‌ఏలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో సర్ ద్వారా తొలగించిన ఓట్లతోనే ముఖ్యమంత్రులైన మమతా బెనర్జీ, స్టాలిన్‌లు ఓడిపోయారన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా జమ్మలమడుగు నియోజకర్గంలో దాదాపు 40వేల ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టింది. వైఎస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు లక్ష్యంగా కూటమి నాయకులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అందువల్ల నిజమైన ఓట్ల కాపాడుకోవాల్సిన బాధ్యత బీఎల్‌ఏలపై ఉందని తెలిపారు. రాబోయే స్థానిక సంస్ధల ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని, ప్రజలు కూడా వైఎస్సార్‌సీపీని గెలిపించటానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
కూటమినేతల దౌర్జన్యాలు
పెరిగిపోయాయి: ఎమ్మెల్సీ పీఆర్
నియోజకవర్గంలో ఇసుక దోపిడీ, పరిశ్రమలపై దౌర్జన్యాలకు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, కూటమి నాయకులు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి విమర్శించారు. సోమవారం జరిగిన బీఎల్‌ఏ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి కమిటీలు, నాయకులు, బీఎల్‌ఏలందరూ కలిసి కట్టుగా పనిచేస్తే కచ్చితంగా విజయం వరిస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలేదన్నారు. ప్రభుత్వంపైన తీవ్ర వ్యతిరేకత ఉందని, వారు ప్రజలల్లో ఇంటింటికి తిరగలేని పరిస్థితి వచ్చిందన్నారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామ, వార్డు స్థాయి నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లను పోటీలో నిలబెట్టి తీరుతామన్నారు. అందుకు కార్యకర్తలు నాయకులు సైతం పోటీ చేయటానికి సిద్ధంగా ఉండాలని పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పరిశీలకులు అజయ్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు పోరెడ్డి నరసింహారెడ్డి, చల్లా మదుసూధన్‌రెడ్డి, వజ్ర భాస్కర్‌రెడ్డి, జోనల్ ఇన్‌చార్జి భరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


