బహుధాన్య హారం..
కడప అగ్రికల్చర్: వైఎస్సార్ జిల్లావ్యాప్తంగా సాగు భూముల సంరక్షణే ధ్యేయంగా ప్రకృతి వ్యవసాయ విభాగం, రైతు సాధికార సంస్థ సంయుక్తంగా ‘బహుధాన్యాల సాగు’ విప్లవానికి శ్రీకారం చుట్టా యి. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఏటా ఒకే రకమైన పంటలు వేయడం, విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడటంతో జిల్లాలో భూములు నిస్సారమవుతున్నాయి. ఈ పోషకాల అసమతుల్యతను అరికట్టి, నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ ఏడాది ఖరీఫ్‌కు ముందే 40 మండలాల పరిధిలో 77,774 హెక్టార్లలో పచ్చిరొట్ట సాగును లక్ష్యంగా నిర్దేశించారు.
15.67 కిలోల కిట్..
29 రకాల విత్తనాల వైవిధ్యం:
రైతులకు పంపిణీ చేస్తున్న ప్రతి బహుధాన్య కిట్ బరువు 15.67 కిలోలు. ఇందులో 10 వృక్ష కుటుంబాలకు చెందిన 29 రకాల విత్తనాలను (తృణధాన్యాలు, పప్పులు, నూనెగింజలు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, దుంపలు) మేళవించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న బయో రీసోర్స్ సెంటర్ల ద్వారా అధికారులు మొత్తం 46,280 కిట్లను సిద్ధం చేయగా, ఇప్పటికే 31,548 మంది రైతులకు 44,412 కిట్లను పంపిణీ చేశారు. అన్నదాతలు ముందస్తు వర్షాల తేమతో ఇప్పటివరకు 38,727 ఎకరాల్లో ఈ సాగును విజయవంతంగా ప్రారంభించారు. జూలై చివరి వరకు ఈ విస్తీర్ణం మరింత పెరగనుంది.
ఎల్‌నినో ముప్పుకు బ్రేక్
ఈ ఏడాది ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న తరుణంలో ఈ సాగు రైతులకు రక్షణ కవచంగా మారనుంది.
పోషకాల గని: భూమిలో స్థూల, సూక్ష్మ పోషకాలు పెరిగి, సేంద్రియ కర్బనం వృద్ధి చెందుతుంది.
తేమ సంరక్షణ: నేల గుల్లబారి, వర్షపు నీటిని ఎక్కు వ రోజులు నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది.
చీడపీడల నివారణ: జీవవైవిధ్యం వల్ల ప్రధాన పంటలకు చీడపీడల ముప్పు తప్పుతుంది.
పశుగ్రాసం లభ్యత: అరకొర వర్షాలకే తట్టుకునే ఈ పంటలు పశువులకు మేలైన దాణాగా ఉపయోగపడతాయి. పంట ఎదిగిన తర్వాత భూమిలోనే కలియదున్నడం వల్ల అవి త్వరగా కుళ్లిపోయి, మేలైన సేంద్రియ పదార్థంగా మారి వేరు వ్యవస్థను దృఢపరుస్తాయి.


