కలసపాడు : ఖాళీగా కనిపించిన స్థలాలను ఆక్రమించే కబ్జాదారులు శ్మశానాలను కూడా వదలడం లేదు. మండల పరిధిలోని పిడుగుపల్లె గ్రామానికి చెందిన శ్మశానస్థలం కబ్జాకు గురైంది. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే స్థలాన్ని కబ్జా చేసి కంచె ఏర్పాటు చేసి మొక్కలు నాటారు. చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిడుగుపల్లె గ్రామ రెవెన్యూ పొలం 1439/1 లో సుమారు 30 సెంట్ల స్థలాన్ని గ్రామస్తులు శ్మశానానికి ఉపయోగిస్తున్నారు. గ్రామంలో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించి కార్యక్రమాలన్నీ అక్కడే పూర్తి చేసుకునేవారు. అయితే ఇటీవల గ్రామానికి చెందిన గంటావెంకటరామిరెడ్డి, క్రిష్ణారెడ్డిలు తమ పొలానికి పక్కన ఉన్న 30 సెంట్ల శ్మశాన స్థలంపై కన్నేసి ఆక్రమించారు. గ్రామస్తులు ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలిపినప్పటికీ రెవెన్యూ అధికారులు తగిన రీతిలో స్పందించకపోవడంతో ఆక్రమణదారులు రాత్రికి రాత్రే కంచె ఏర్పాటు చేసి మొక్కలు నాటారు. 1439 సర్వే నంబరులో గతంలో గంటారామిరెడ్డికి పట్టాలు మంజూరయ్యాయి. వారికి మంజూరైన స్థలం వారి ఆఽధీనంలోనే ఉండగా 30 సెంట్ల శ్మశాన స్థలం ఖాళీగానే ఉండేది. ఇటీవల రెవెన్యూ అధికారులు సర్వే చేసి 30 సెంట్లు శ్మశానస్థలంగా తేల్చారు. అయినప్పటికీ ఆక్రమణను అడ్డుకోలేకపోయారు. ఇటీవల గ్రామానికి చెందిన నాగిరెడ్డిఆదిలక్ష్మి మరణించగా అంత్యక్రియలు చేసేందుకు శ్మశానస్థలం లేక రోడ్డు పక్కనే చేయాల్సి వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న శ్మశానం ఆక్రమణకు గురికావడంతో గ్రామస్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి ఆక్రమణదారులపై తగిన చర్యలు తీసుకుని శ్మశాన స్థలాన్ని కాపాడాలని పిడుగుపల్లె గ్రామ ప్రజలు కోరుతున్నారు.
చర్యలు తీసుకోని రెవెన్యూ అధికారులు


