ఎర్రగుంట్ల : రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను మోసగించి వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు దొంగలించి, వాటి ద్వారా యూపీఐ అప్లికేషన్లు ఉపయోగించి బ్యాంక్ ఖాతాల నుంచి అక్రమంగా డబ్బులు బదిలీ చేసుకుంటున్న అంతరాష్ట్ర దొంగల ముఠాలో ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు రైల్వే సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం యర్రగుంట్లలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన హరిబర్మన్, బీహార్ రాష్ట్రానికి చెందిన సంతోషకుమార్‌షా పలు కేసులలో నిందితులుగా ఉన్నారు. వీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు కర్ణాటక తదితర రాష్ట్రాల మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏసీ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికులు నిద్రలో ఉన్న సమయంలో చార్జింగ్ పెట్టిన సెల్‌ఫోన్లును దొంగలించే వారు. ఆ సెల్ ఫోన్లలో ఉన్న సిమ్‌కార్డులు, ఓటీపీ, బ్యాకింగ్ యాప్స్, యూపీఐ అప్లికేషన్లు ఉపయోగించుకుని బాధితుల బ్యాంక్ ఖాతాలలో నుంచి అక్రమంగా డబ్బులను వివిధ బ్యాంక్ ఖాతాలు, యూపీఐ ఐడీలు, ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లకు మళ్లించినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో నిందితులు సంతోషకుమార్‌షా చండిఘడ్ రాష్ట్రానికి చెందిన వికాష్‌షా, మొహాలీకి చెందిన రాహిల్‌భగత్‌ల ద్వారా తృతీయ పక్ష బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరించి హరిబర్మన్‌కు అందించే వాడు. ఇలా మొత్తం హరిబర్మన్‌కు పంపి మోసపూరిత నగదు ఆ ఖాతాల్లో జమ అయ్యేది. ఆ మొత్తంలో సంతోష్‌కుమార్‌షా ఖాతాల ఏర్పాటు కోసం సుమారు 20 శాతం కమీషన్ చెల్లించే వారు. మిగిలిన మొత్తాన్ని హరిబర్మన్ సూచించిన ఇతర ఖాతాలకు, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ ఖాతాలకు తిరిగి పంపించే వారని విచారణలో వెల్లడైంది. హరిబర్మన్ గతంలో రేణిగుంట రైల్వే పోలీసులచే, సంతోషకుమార్‌షా విజయవాడ పోలీసులచే అరెస్టు చేయబడి జైలుకు వెళ్లి అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చినట్లు తెలిసింది. ఈ కేసులో 9 సెల్‌ఫోన్లు, రూ.1.50 లక్షలు నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ దర్యాప్తు రైల్వే డీఐజీ సత్యేసుబాబు ఆధ్వర్యంలో, రైల్వే డీఎస్పీ ప్రమోద్ పర్యవేక్షణలో జరిగింది. ఈ నిందితులకు గుత్తి, నెల్లూరు, యర్రగుంట్ల రైల్వే పోలీస్‌స్టేషన్‌లలో నమోదైన పలు కేసులలో ప్రయేయం ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉందని సీఐ తెలిపారు. ఈ సమావేశంలో రైల్వే ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి, ఆర్‌పీఎఫ్ ఐపీఎఫ్ శ్రీనివాసులు, ఎస్‌ఐ గోవిందప్ప, ఏఎస్‌ఐ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.


