కడప కార్పొరేషన్: కడప మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యిందని కమిషనర్ హెచ్‌ఎస్ భావన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇదివరకు 50 వార్డులు ఉండగా, ప్రస్తుతం వాటిని 66కు పెంచినట్లు తెలిపారు. వార్డుల సరిహద్దులు, ఇతర వివరాలను ప్రకటించినట్ల చెప్పారు. దీనిపై అభ్యంతరాలుంటే రాతమూలకంగా తెలియజేయవచ్చని పేర్కొన్నారు.
కడప సెవెన్‌రోడ్స్: చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న ప్రజల సంక్షేమం కోసం తమ పార్టీ కృషి చేస్తుందని జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ అధ్యక్షులు అవ్వారు మల్లికార్జున అన్నారు. ఆదివారం కడపలోని తమ పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల విభాగాన్ని ఏర్పాటు చేశారు. భవన నిర్మాణ విభాగం జిల్లా అధ్యక్షుడిగా మల్లెల నారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రానున్న రోజుల్లో అన్ని కార్మిక విభాగాలను ఏర్పాటు చేస్తామని ఈ సందర్బంగా అవ్వారు మల్లికార్జున అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కడప నగర అధ్యక్షుడు జయరాములు, 14వ డివిజన్ అధ్యక్షుడు గంగులు, వివిధ సంఘాల నాయకులు నరసింహులు, వెంకట రమణ, మహబూబున్నీసా, ఓబులేశు, షేక్ ఇస్మాయిల్, చౌడూరు ఖాసిం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కడప అర్బన్: ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 198 కేసులు నమోదు చేసి, రూ. 57,445 జరిమానా విధించినట్లు తెలిపారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కార్లలో వెళ్లే వారు సీట్ బెల్ట్ ధరించాలని ఆయన సూచించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గుర్రంకొండ: రెడ్డెమ్మతల్లీ చల్లంగా చూడమ్మా అంటూ భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల వచ్చారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కుబడులు చెల్లించుకొన్నారు. కర్ణాటక, తమిళనాడుతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు.
గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయ అభివృద్ధికి పలువురు దాతలు విరాళాలను అందజేశారు. వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టకు చెందిన సోమశెట్టి వెంకటేశ్వర్లు రూ.25 వేలు, ఇదే గ్రామానికి చెందిన సోమశెట్టి రెడ్డెయ్య, రెడ్డిమణిచందన, వరుణ్‌కుమార్‌లు రూ. 25 వేలు అందజేశారు. ఆదివారం ఆలయానికి చేరుకొన్న దాతలకు, వారి కుటుంబసభ్యులకు అధికారులు స్వాగతం పలికి అమ్మవారికి పూజలు చేయించి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. దాతలు రూ. 50వేలను ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ రాజన్న నాయుడు, ఈవో మంజులకు అందజేశారు. ఈమొత్తాన్ని వాల్మీకీపురం ఆంధ్రప్రదేశ్ గ్రామీణబ్యాంకు నందు జమ చేయనున్నట్లు ఈవో పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది బాల కృష్ణ, మహేష్, వెంకటరమణ పాల్గొన్నారు.


