సిద్దవటం: నిత్యపూజకోనలోని శాశ్వత హుండీలు మాయమైనట్లు భక్తులు తెలిపారు.ఆదివారం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా వారంలో ఒక్కరోజు మాత్రమే శాశ్వత హుండీలు దర్శనమిస్తున్నాయన్నారు. వీటిని తాత్కాలిక హుండీలుగా ఎండోమెంట్ అధికారులు మార్చేశారని వారు ఆరోపించారు. సిద్దవటం మండలం లేదా వంతాటిపల్లి గ్రామంలో ఉండాల్సిన నిత్యపూజకోన ఈఓ కార్యాలయం కడపలో ఎందుకు ఉందని ప్రశ్నిస్తున్నారు. దేవదాయ శాఖ నిబంధనల ప్రకారం శాశ్వత హుండీలు 24/7 ఆలయ ప్రాంగణంలో మాత్రమే ఉండాలన్నారు. ఇక్కడ నాలుగు శాశ్వత హుండీలు ఉండాలని,అవి ఎక్కడికి వెళ్లాయో అని వాపోతున్నారు. ఆదివారం భక్తులు హుండీలో డబ్బులు వేయాలని వెళ్లారు. అయితే హుండీలు లేవు. ఎక్కడ ఉన్నాయని అడగ్గా లేవని అక్కడ ఉన్న ఓ వ్యక్తి తెలిపారన్నారు. రూ.45 లక్షలు వార్షిక ఆదాయం ఉన్న ఆలయంలో మహిళలు వస్త్రాలు మార్చుకోవడానికి తాత్కాలిక డ్రెస్సింగ్ కేంద్రాలు కూడా లేవన్నారు. ఆలయ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నా ఎండోమెంట్ అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు పేర్కొన్నారు. ఈ విషయమై ఆలయ ఈఓ కొండారెడ్డిని వివరణ కోరగా ఆలయ ఆవరణలో నాలుగు శాశ్వత హుండీలు ఉన్నాయన్నారు. కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు.


