టీడీపీలో ఇరు వర్గాల ఘర్షణ | - | Sakshi
Sakshi News home page

టీడీపీలో ఇరు వర్గాల ఘర్షణ

May 18 2026 6:57 AM | Updated on May 18 2026 6:57 AM

కుందూ మట్టి తరలింపుపై వివాదం

దారి కోసం వాగ్వాదం

ఒకరిపై ఇద్దరు దాడి

బాధితుడికి తీవ్ర గాయాలు

ప్రొద్దుటూరు : కుందూనది నుంచి మట్టిని తొలుకునే క్రమంలో దారి కోసం టీడీపీలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘర్షణ కారణంగా జరిగిన సంఘటనకు సంబంధించి టీడీపీకి చెందిన కల్లుట్ల మౌళాలిపై మరోవర్గం వారు దాడి చేశారు. వివరాలిలా వున్నాయి. రాజుపాళెం మండలంలోని వెలవలి గ్రామ సమీపంలోని కుందూనదిలో మట్టిని తరలిస్తున్నారు. అక్కడ నదిలో దారి కోసం టీడీపీలోని ఇరు వర్గాల వారు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో ఆ పార్టీకి చెందిన వారు అదే పార్టీకి చెందిన వ్యక్తిపై కట్టెతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వెలవలి–తొండలదిన్నె గ్రామాల మధ్యలో ఉన్న వంతెన సమీపంలో నదిలో నుంచి మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టరుకు మట్టిని నింపేందుకు రూ.200 వసూలు చేస్తున్నారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు హిటాచీ సాయంతో మట్టిని ట్రాక్టర్లలో నింపుతున్నారు.

టీడీపీలో ఇరు వర్గాలు ఘర్షణ

హిటాచీ వద్ద నుంచి దాటే సమయంలో నదిలో దారి కోసం టీడీపీలోని ఇరువర్గాలు ఆదివారం తగాదా పడ్డారు. ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకొని వెలవలి గ్రామంలో టీడీపీ నాయకులు మౌళాలిపై కట్టెతో దాడి చేయడంతో తలకు, కంటి వద్ద తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి నేపథ్యంలో రాజుపాళెం పోలీసులు విచారణ చేపట్టారు. మండలంలోని తొండలదిన్నె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వెలవలి గ్రామ సమీపంలో కుందూనదిలో హిటాచీ సహాయంతో నదిలోని మట్టిని గత కొన్ని రోజులుగా ట్రాక్టర్ల ద్వారా తరలించడం జరుగుతుంది. అయితే వెలవలి గ్రామానికి చెందిన కల్లుట్ల మౌళాలి మరో హిటాచీ సహాయంతో నదిలోని మట్టిని తరలించేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో నదిలో మందుగా ఉన్న దారి కోసం ఈ ఘర్షణ చోటు చేసుకుంది.

ఎమ్మెల్యే సార్‌ కాపాడు... సీఎం సార్‌ కాపాడు

కుందూనది వద్ద తీవ్ర గాయాలపాలైన మౌళాలిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, తనను ఎమ్మెల్యే బతికించు, సీఎం బతికించు అంటూ వేడుకోవడం జరిగింది. ఈ సంఘటన జిల్లా స్థాయిలో చర్చినీయాంశంగా మారింది. మౌళాలిని ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ఆయన కుటుంబసభ్యులతోపాటు బంధువులు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు.

వెలవలి గ్రామంలో ఉద్రిక్తత

కుందూలో మట్టిని తరలించే క్రమంలో నదిలో దారికోసం జరిగిన సంఘటన నేపథ్యంలో వెలవలి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అక్రమంగా కుందూనదిలో మట్టిని తరలిస్తున్నారని టీడీపీలో ఒక వర్గం ఆరోపిస్తోంది. ఈ మట్టి కుమ్ములాటలో కొట్టుకునేంత వరకు పరిణామాలు దారితీశాయి. పోలీసులు రంగప్రవేశం చేయడంతో మట్టిని తవ్వుతున్న హిటాచీలను నిర్వాహకులు మరో చోటికి తరలించారు. మళ్లీ ఎటువంటి గొడవలు జరగకుండా గ్రామంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దాడికి పాల్పడిన వారు పరారీ కావడంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. పోలీసులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మౌళాలిని సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఇద్దరిపై కేసు నమోదు

రాజుపాళెం : దారి కోసం టీడీపీలో ఇరు వర్గాలు ఘర్షణ పడిన కేసులో టీడీపీలో ఓ వర్గానికి చెందిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఆదివారం రాత్రి తెలిపారు. అందులో వెలవలి గ్రామానికి చెందిన మౌలాలిపై దాడి చేసినట్లు.. అదే గ్రామానికి చెందిన కమ్ముసాబ్‌ గారి రసూల్‌, ఖాజావల్లిపై కేసు నమోదు చేశారు. వారు పరారీలో ఉండటంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement