డ్రైవరూ.. జాగ్రత్త టైరు | - | Sakshi
Sakshi News home page

డ్రైవరూ.. జాగ్రత్త టైరు

May 18 2026 6:57 AM | Updated on May 18 2026 6:57 AM

వాహనాల టైర్లు పేలి వరుస ప్రమాదాలు

వేసవిలో అప్రమత్తత అవసరం

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : వాహనాలు కండిషన్‌లోనే ఉన్నాయి. క్రమం తప్పకుండా సర్వీసింగ్‌ చేస్తున్నాం. అని ధీమాలో ఉంటే సరిపోదు. టైర్లలో గాలి తరచూ సరిచూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వాహనం బయలుదేరడానికి ముందే ఒకటికి రెండు సార్లు టైర్లు ఎలా ఉన్నాయి. వాటిలో సరిపడినంత గాలి ఉందా అని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో టైర్లు పేలిపోయి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జిల్లాలో ఈ తరహా చిన్న చిన్న ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.రబ్బర్‌ గట్టి పడటంతో అందులో పరిమితికి మించి గాలి పట్టినప్పుడు.. గుంతల్లో పడినప్పుడు టైర్లు పేలిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో అరిగిపోయిన టైర్లతో వాహనాల్లో ప్రయాణం చేయడం ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.

ఆ అక్షరమే.. భద్రత కీలకం

టైర్లు కొనుగోలు చేసే సమయంలో దాని తయారీ సంవత్సరం చూసుకోవాలి. రీ బటన్‌ వేసిన వాటిని కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. మరోవైపు బైకులు, కార్లు, బస్సులు, లారీల టైర్లు నాణ్యత, స్వీట్‌ రేటింగ్‌ సరిగ్గా లేకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. టైర్‌ స్వీట్‌ రేటింగ్‌ అక్షరాల్లో ఉంటుంది. ప్రతి టైర్‌పై దాని సామర్థ్యం తెలియజేసే ప్రత్యేకమైన కోడ్‌ ఉంటుంది. అందులో చివరి ఆల్ఫాబెటికల్‌ అక్షరం చాలా కీలకమైంది. దాని టైర్‌ స్పీడ్‌ రేటింగ్‌ అంటారు. వాహన కంపెనీలు ఆ మోడల్‌కు తగిన స్పీడ్‌ రేటింగ్‌ నిర్ణయిస్తాయి. డ్రైవర్‌ డోర్‌ వద్ద ఉండే స్టిక్కర్‌ లేదా వాహన మాన్యువల్‌లో ఇది స్పష్టంగా ఉంటుంది. హైవేలపై డ్రైవ్‌ చేసే వారు హెచ్‌వీ రేటింగ్‌ టైర్లు వినియోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా టైర్లు మన్నిక కాలం ఐదారు ఏళ్లు ఉంటుంది. కొత్త టైర్‌ తీసుకునే సమయంలో అది ఎప్పుడు తయారైంది అనేది తప్పనిసరిగా పరిశీలించాలి. ఉదాహరణకు 1226 అని ఉంటే 2026వ సంవత్సరం 12వ వారంలో తయారైనట్లు అర్థం.

Advertisement
 
Advertisement
Advertisement