● అధికారులు చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో కష్టాలు తప్పవు
● ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి
జమ్మలమడుగు : గ్రామంలో వాటర్ ప్లాంట్ నిర్వహణ, గ్రామ పంచాయతీలో నిధులు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో.. వాటిపై సమాచార హక్కు చట్టం కింద సమాచారం అందించాలని కోరితే ఆ వ్యక్తిపై భౌతిక దాడులకు దిగడం ఏమిటని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ప్రశ్నించారు. ఫిర్యాదు చేసినా పోలీసు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సరైంది కాదని అన్నారు. ఆదివారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎర్రగుంట్ల మండలం చిలంకూరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త పవన్‌కుమార్ నాయుడు గ్రామంలో ఉన్న వాటర్ ప్లాంట్ నిర్వహణకు సంబంధించిన వివరాలను అడితే దానికి అధికారులు సమాచారం ఇవ్వకుండా.. అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ విషయం తెలిపి.. వారు దౌర్జన్యం చేసే విధంగా చేయడం దారుణం అన్నారు. అధికారం శాశ్వతం కాదని, రేపు వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అని గుర్తు పెట్టుకోవాలన్నారు. సుబ్బరామిరెడ్డి, శంకర్‌రెడ్డి ట్రస్టుల పేరుతో ప్రజలకు మంచి చేస్తున్నామంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీ నుంచి నీరు సరఫరా అవుతుంటే వాటికే కనెక్షన్లు తీసుకుని కరెంటు బిల్లులు పంచాయతీ చేత కట్టించుకుంటున్నారని ఆరోపించారు. దానికి సంబంధించిన ఆదాయం మాత్రం కూటమికి సంబంధించిన కార్యకర్తలు తీసుకుంటున్నారన్నారు. ఈ దుర్మార్గానికి అధికారులు కూడా సహకరించడం సరైంది కాదన్నారు. నియోజకవర్గంలో కూటమి నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయన్నారు. పోలీసు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతోపాటు వారికి వత్తాసు పలికితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కూటమి నాయకులు అవినీతికి పాల్పడుతూ, సహజ వనరులను దోచుకుని కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు. కొండాపురంలోని పెన్నానది, చిత్రావతి, పట్టణంలోని పెన్నానదిలోని ఇసుక అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ఇప్పటికై నా అధికారులు అధికార పార్టీకి కొమ్ముకాయడం మాని నిజాయితీగా పని చేస్తే.. భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా ఉంటారని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్‌ఈసీ సభ్యుడు గిరిధర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, బీసీ నాయకుడు గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.


