వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రొద్దుటూరు అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రొద్దుటూరు అభివృద్ధి

May 18 2026 6:57 AM | Updated on May 18 2026 6:57 AM

ప్రొద్దుటూరు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో భారీగా అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. ప్రొద్దుటూరుకు వచ్చిన సందర్భంగా ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాగునీరు, రోడ్లు, ఆర్టీసీ బస్టాండ్‌ నిర్మాణం, మార్కెట్‌ నిర్మాణ పనులను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న రాచమల్లు శివప్రసాదరెడ్డి అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో మంజూరు చేయించారన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తే సరిపోతుందన్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా బస్టాండ్‌ను నిర్మించారని, కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయినా దానిని ప్రారంభించలేకపోతోందన్నారు. రోడ్లు విస్తరణ చేపట్టి డివైడర్లను ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రూ.50 కోట్లతో మార్కెట్‌ నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో కనీసం పవర్‌ కట్‌ లేకుండా నియంత్రించే పరిస్థితి లేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాచమల్లు శివప్రసాదరెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారన్నారు. ఒక్క మారు ప్రభుత్వం అధికారంలో ఉండటంతోనే నియోజకవర్గాన్ని ఈ స్థాయిలో అభివృద్ధి చేశారన్నారు.

చంద్రబాబు మాటల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ముఖ్యమంత్రి చంద్రబాబు మాటల పట్ల రాష్ట్రంలోని తల్లిదండ్రులందరూ అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. శ్రీకాకుళంలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ మూడో సంతానం కంటే రూ.30 వేలు, నాలుగో సంతానం కంటే రూ.40 వేలు, ఐదో సంతానం కంటే రూ.50 వేలు ఇస్తానని ప్రకటించారన్నారు. చంద్రబాబు చెప్పిన ప్రకారం ఇచ్చినా రూ.30 వేలు కేవలం కాన్పునకు మాత్రమే సరిపోతుందని తెలిపారు. సంతానం పుట్టిన తర్వాత వారి పోషణ బాధ్యతను ఎవరు తీసుకుంటారని, భవిష్యత్తులో వారికి విద్య, ఉద్యోగ అవకాశాలు గ్యారెంటీ ఉందా అని అన్నారు. ఎంతో మంది పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థిక భారంతో సరైన ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడు అదనపు సంతానం కలిగితే వారి పరిస్థితి ఏమిటని అన్నారు. సరైన భవిష్యత్తును కల్పించకపోతే పుట్టే సంతానం అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. సమావేశంలో టీటీడీ పాకలమండలి మాజీ సభ్యులు చిప్పగిరి ప్రసాద్‌, టంగుటూరు మారుతిప్రసాద్‌, వైఎస్సార్‌సీపీ ఆర్యవైశ్య విభాగం రాష్ట్ర నాయకుడు కరుణాకర్‌ పాల్గొన్నారు.

మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌

Advertisement
 
Advertisement
Advertisement