జమ్మలమడుగు రూరల్ : పెద్దపసుపల గ్రామానికి చెందిన భాస్కర్(32) అనే యువకుడు ఆదివారం తిరుపతి– జమ్మలమడుగు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా మృతి చెందాడు. ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దముడియం మండలం పెద్దపసుపల గ్రామానికి చెందిన భాస్కర్ స్వగ్రామం వదలి కొన్నేళ్లుగా తాడిపత్రిలోని కొండెపల్లి గ్రామంలో ఉన్నాడు. కాగా ఆర్థిక సమస్యలతో 8 నెలల క్రితం స్వగ్రామమైన పెద్దపసుపలకు చేరుకున్నాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం శనివారం కదిరికి వెళ్లాడు. ఆదివారం తిరిగి తిరుపతి నుంచి జమ్మలమడుగు వస్తున్న ఆర్టీసీ బస్సులో బయలుదేరాడు. బస్సు జమ్మలమడుగు పాతబస్టాండ్‌కు వచ్చినా.. సీటులో నుంచి లేవకపోవడంతో సిబ్బంది భాస్కర్‌ను లేపారు. కానీ లేవకపోవడంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. ఆ మేరకు తండ్రి స్వామిదాసు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మృతి చెందడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
హార్సిలీహిల్స్‌లో పర్యాటకుల ఆటో బోల్తా
మదనపల్లె టౌన్ : ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్ పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తున్న పర్యాటకుల ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా, నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం హార్సిలీ హిల్స్ మూడవ మలుపు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన పి.కార్తీక్(19)తో పాటు మరో ఆరుగురు స్నేహితులు హార్సిలీహిల్స్‌కు పర్యటనకు వచ్చారు. పర్యటన ముగించుకుని సాయంత్రం ఆటోలో తిరుగు ప్రయాణ మయ్యారు. మార్గంమధ్యలోని హర్సీలీ హిల్స్ 3వ మలుపు వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఏడుగురిలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను బయటికి తీసి మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆళ్లగడ్డ ప్రమాదంలో సదుం వాసి మృతి
సదుం : నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సదుం మండల వాసి ఆదివారం మృతి చెందారు. గ్రామస్తుల కథనం మేరకు.. కంభంవారిపల్లె పంచాయతీ కురవపల్లెకు చెందిన సుబ్రమణ్యం(59 వ్యక్తిగత పనుల నిమిత్తం ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో హైదరాబాదుకు బయలుదేరారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో బస్సు లారీని ఢీకొన్న ప్రమాదంలో ఆయన మృతి చెందారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు.


