ముద్దనూరు : మండలంలోని ఉప్పలూరు గ్రామంలో పాలగిరి బాలవీరయ్య అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన వీరబోయిన లక్ష్మీనరసయ్య ఆదివారం మచ్చుకత్తితో దాడి చేశాడు. దీంతో లక్ష్మీనరసయ్యపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సీఐ నగేష్‌బాబు సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బాలవీరయ్య, లక్ష్మీనరసయ్య మధ్య కొంత కాలం నుంచి మనస్పర్థలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం గ్రామంలో ఓ వ్యక్తి ఇచ్చిన విందుకు ఇరువురు హాజరయ్యారు. భోజన సమయంలో వీరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. దీంతో వీరయ్యను నరసయ్య బెదిరించాడు. అనంతరం వీరయ్య ఇంటి వద్దకు వెళ్లి అతనిని బయటికి పిలిచి మచ్చుకత్తితో దాడి చేశాడు. దీంతో వీరయ్య ముఖం మీద, రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమయంలో తండ్రిని కాపాడడానికి వచ్చిన వీరయ్య కుమారుడు వినోద్‌ను కూడా నరసయ్య కత్తితో నరికినట్లు అతని ఎడమ చేతి వేలికి గాయమైనట్లు, వినోద్ ఫిర్యాదు మేరకు నరసయ్యపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. తీవ్ర గాయాల పాలైన వీరయ్యను 108 వాహనంలో ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కడపకు తీసుకెళ్లారు.


