అట్లూరు : భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో భార్య విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన అట్లూరు ఎస్సీ కాలనీలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌ఐ నాగకీర్త శనివారం తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అట్లూరు ఎస్సీ కాలనీకి చెందిన గోపాలయ్య, గోపాలమ్మల కుమార్తె దేవిని 8 ఏళ్ల క్రితం బద్వేలు మండలం కోనసముద్రానికి చెందిన కమలకూరు భాస్కర్‌కు ఇచ్చి వివాహం చేశారు. భాస్కర్ అట్లూరుకు వచ్చి అత్తగారింటిలో ఉంటూ జీవనం సాగించేవాడు. ఈనెల 14న రాత్రి భార్యాభర్తలు సెల్‌ఫోన్ విషయమై గొడవపడి కమలకూరు దేవి విషద్రావణం తాగగా హుటాహుటీన బద్వేలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దేవి మృతి చెందింది. మృతురాలికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మృతురాలి తల్లి గోపాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


