● రూ.150 కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి కాపాడాలి
● మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
కడప సెవెన్‌రోడ్స్ : ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామం వద్ద ఉన్న పెన్నా నదిలో ఇసుక దోపిడీకి పాల్పడుతున్న స్థానిక ఎమ్మెల్యే కుమారుడు నంద్యాల కొండారెడ్డి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, జెడ్పీ ఉపాధ్యక్షులు జేష్టాది శారదతో కలిసి కలెక్టర్‌కు ఆయన వినతిపత్రం సమర్పించారు. అనంతరం రాచమల్లు విలేకరులతో మాట్లాడుతూ 50 ఏళ్లుగా కొంతమంది పేద రైతులు పెన్నానది పరీవాహక ప్రాంతంలో భూమిని చదును చేసుకుని వ్యవసాయం సాగిస్తున్నారని తెలిపారు. అయితే, ఇటీవల కూటమి ప్రభుత్వం వీరికి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా భూములను స్వాధీనం చేసుకుందని తెలిపారు. ఆ భూములు చదును చేసి రోడ్లు, కాలువలు నిర్మించి ప్రభుత్వానికి అప్పగించే కాంట్రాక్టు పనిని నంద్యాల కొండారెడ్డి ఏపీఐఐసీ ద్వారా పొందారని పేర్కొన్నారు. ఆ భూముల్లో వెంచర్లు వేసి పారిశ్రామికవేత్తలకు విక్రయించడం ద్వారా ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పాల్పడుతోందని విమర్శించారు. పగలు కాంట్రాక్టు పనులు చేసే ఎమ్మెల్యే కుమారుడు రాత్రి ఇసుకను అక్రమంగా చాగలమర్రి, మదనపల్లె ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇందువల్ల భవిష్యత్తులో రంగసాయిపురం, శంకరాపురం, కాకిరేనిపల్లె, చౌడూరు గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొనే ప్రమాదముందని తెలిపారు. అలాగే శంకరాపురం, చౌడూరు గ్రామాలు ముంపునకు గురవుతాయన్నారు. ఇంత జరుగుతున్నా తహసీల్దార్, మైనింగ్ అధికారులు, పోలీసులు, ఏపీఐఐసీ అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. కాంట్రాక్టర్‌గా ఉన్న వ్యక్తి నిబంధనల ప్రకారం చదును చేసే సమయంలో తొలగించిన ఇసుకను ఒకచోట డంప్ చేయాలే తప్ప తరలించరాదన్నారు.
స్టేటస్ కో అమలు చేయాలి
తాను హైకోర్టుకు వెళ్లగా, స్టేటస్ కో ఇచ్చారని పేర్కొన్నారు. అయితే అందుకు కూడా మెలిక పెట్టారన్నారు. తాము సర్వే నెంబరు 699/1, /3లో పనులు చేస్తున్నామంటూ నమ్మబలుకుతున్నారన్నారు. కానీ, 657 పూరా సర్వే నంబరులో 354 ఎకరాలు ఉన్నాయని, సబ్ డివిజన్ చేశాక 699/1, 699/3 ఏర్పడ్డాయని వివరించారు. ప్రభుత్వం వేస్తున్న వెంచర్ల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడంతోపాటు ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాలని, స్టేటస్ కో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరు పట్టణం 1వ వార్డుకు చెందిన బొల్లవరంలో రూ.150 కోట్ల విలువజేసే భూమిని కాజేసి రియల్ ఎస్టేట్ ద్వారా రూ.200 కోట్లు దోచుకోవాలని పథకం పన్నారన్నారు. ఆ భూమిని కాపాడాలని కోరారు.


