సిద్దవటం : మండలంలోని భాకరాపేట వద్ద శనివారం బద్వేల్ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దెబస్సు కింద పడి ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బెంగళూరులోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన కామాక్షి తన బంధుమిత్రులతో కలిసి తిరుపతి సమీపాన ఉన్న నారాయణవనం నుంచి రైలులో ప్రయాణిస్తూ భాకరాపేటకు చేరుకున్నారు. అక్కడి నుంచి బ్రహ్మంగారిమఠానికి వెళ్లేందుకు బద్వేల్ వైపు వెళుతున్న ఆర్టీసీ అద్దెబస్సును వినీత్(10) తన తల్లి కామాక్షితో కలిసి ఎక్కుతుండగా.. కండక్టర్ గమనించకుండా ఉండటంతో డ్రైవర్ మోహన్ కృష్ణ బస్సు కదిలించాడు. ఆ బాలుడు కిందపడి బస్సు వెనక టైరు అతని కాలిమీద వెళ్లడంతో ఎడమకాలు పూర్తిగా దెబ్బతినింది. ఆ రక్తగాయాలు చూసిన తల్లి స్పృహ తప్పి పడిపోయింది. గాయపడిన బాలుడిని చికిత్స కోసం స్థానికులు 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. జరిగిన సంఘటనపై మండల ఎస్‌ఐ హారిక విచారణ చేస్తున్నారు.
ఆగని కేబుల్ వైరు చోరీలు
రామసముద్రం : మండలంలో కేబుల్ వైర్ల చోరీలు వరుసగా జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఊలపాడులో రైతుల బోర్ల వద్ద కేబుల్ వైర్లు చోరీ కాగా.. శుక్రవారం రాత్రి ఆర్.నడింపల్లి పంచాయతీ బొంపల్లి గ్రామంలో పంచాయతీ తాగునీటి బోరు కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. రాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తులు వైర్లు అపహరించడంతో గ్రామంలో తాగునీటి సరఫరా నిలిచిపోయింది.
జేసీబీని ఢీకొన్న బైక్
పుంగనూరు : మండలంలోని సింగిరిగుంట గ్రామానికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు సంతోష్(18) అనే యువకుడు శనివారం ద్విచక్రవాహనంలో వెళ్తూ ఎదురుగా వస్తున్న జేసీబీ వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో సంతోష్‌కు తీవ్ర గాయాలై, ఎడమకాలు విరిగింది. అటుగా వెళ్తున్న హెల్పింగ్ లయన్స్ సభ్యుడు బషీర్ అలీ గమనించి బాధితున్ని తన ఆటోలో ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు.


