ఎస్‌ఐ దూషించి.. తీవ్రంగా కొట్టి.. | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐ దూషించి.. తీవ్రంగా కొట్టి..

May 17 2026 7:02 AM | Updated on May 17 2026 7:02 AM

జమ్మలమడుగు : ఓ మహిళకు అప్పు ఉన్నానంటూ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి డబ్బు కట్టాలంటూ తనపై వత్తిడి తీసుకురావడంతోపాటు బెల్టుతో ఇష్టారాజ్యంగా ఎస్‌ఐ కొట్టారని బాధితుడు, వైఎస్సార్‌సీపీ కార్యకర్త తానిషా వలి వాపోయాడు. శనివారం ఆయన స్థానిక ప్రభుత్వాసుపత్రికి వైద్యం కోసం వెళ్లాడు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తాను మహిళ వద్ద 80 వేల రూపాయలు అప్పు తీసుకోవడం జరిగిందని తెలిపారు. దానికి వడ్డీ కింద 64 వేల రూపాయలు చెల్లించానని పేర్కొన్నారు. అయితే తన పరిస్థితి బాగలేకపోవడంతో అప్పు చెల్లించడంలో జాప్యం జరిగిందన్నారు. గతంలో ఆ మహిళ అనేక చోట్ల పంచాయితీలు పెట్టించిందని, తాను రూ.50 వేలు ఇస్తానని చెప్పానని తెలిపారు. అయితే శుక్రవారం ఆమె స్టేషన్‌కు వెళ్లి డబ్బులపై పంచాయితీ పెట్టిందన్నారు. ఈ సందర్భంగా పోలీసులు పిలవడంతో తాను స్టేషన్‌కు వెళ్లడం జరిగిందన్నారు. ఎస్‌ఐ జోక్యం చేసుకుని డబ్బులు చెల్లించాలని వత్తిడి తీసుకు వచ్చారని పేర్కొన్నారు. తాను 50 వేల రూపాయలు ఇస్తానని పెద్దల సమక్షంలో ఒప్పుకొన్నానని తెలిపారు. అయినా ఎస్‌ఐ వినకుండా.. చెప్పడానికి కూడా వీలులేని తిట్లను తిడుతూ కాళ్లను తిప్పి బెల్టుతో తీవ్రంగా కొట్టడం జరిగిందన్నారు. తనకు షుగర్‌ వ్యాధి ఉందని, ఆరోగ్యం సక్రమంగా లేదని చెబుతున్నా ఇష్టారాజ్యంగా కొట్టడంతోపాటు సెల్‌ ఫోన్‌ లాక్కున్నారన్నారు. శుక్రవారం రాత్రి అంతా విపరీతమైన నొప్పులు ఉండటంతో ప్రభుత్వాసుపత్రిలో వచ్చి చేరడం జరిగిందన్నారు. పోలీసులు సివిల్‌ పంచాయితీలు చేయకూడదని ఉన్నాతాధికారులు చెబుతున్నా.. ఇక్కడ మాత్రం సివిల్‌ పంచాయితీలు చేస్తూ తీవ్రంగా కొట్టడం జరిగిందన్నారు. తనకు న్యాయం జరిగే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆసుపత్రిలో చేరిన బాధితుడు

Advertisement
 
Advertisement
Advertisement