చాపాడు : శ్మశాన వాటిక స్థలం ఆక్రమిస్తున్నారని దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చియ్యపాడు గ్రామ సమీపంలోని గేటురాళ్ల వంక దగ్గర పడమర వైపు ఎకరా పైగా స్థలంలో చియ్యపాడు గ్రామం పుట్టినప్పటి నుంచి దళితులు (మాల) శ్మశాన వాటిక స్థలం ఏర్పాటు చేసుకున్నారు. అనాది నుంచి నేటి తరం వరకు చనిపోయిన వారిని అక్కడే పూడ్చుకుంటున్నారు. అయితే సర్వే నంబర్లు 909, 910, 911లో 9.03 ఎకరాల పొలం ప్రొద్దుటూరుకు చెందిన పద్మనాభరెడ్డికి చెందినదని, దీనిని తాను కొన్నానని చియ్యపాడుకు చెందిన వీరేంద్రనాథ్‌రెడ్డి నాలుగు రోజుల క్రితం నుంచి పొలాలను చదును చేస్తున్నాడని, ఇదే క్రమంలో తమ శ్మశాన వాటిక కూడా తనదేనని అంటున్నాడని దళితులు చెబుతున్నారు. ఊరు పుట్టినప్పటి నుంచి ఉన్న శ్మశానం తమకు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ శ్మశానం ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని దళితులు కోరుతున్నారు. ఈ క్రమంలో శనివారం దళితులు గ్రామ పెద్దలు బాల నరసింహారెడ్డి, శివారెడ్డిలతో కలసి తహసీల్దార్ రమాకుమారికి వినతి పత్రం అందజేశారు. శ్మశానం అన్యాక్రాంతం కాకుండా దళితులకే కేటాయించేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపినట్లు వారు పేర్కొన్నారు. తెలిపారు.


