● చిన్న కారణాలకే జీవితాలు బుగ్గిపాలు | - | Sakshi
Sakshi News home page

● చిన్న కారణాలకే జీవితాలు బుగ్గిపాలు

May 16 2026 1:27 AM | Updated on May 16 2026 1:27 AM

● చిన్న కారణాలకే జీవితాలు బుగ్గిపాలు

ప్రొద్దుటూరు: పిల్లల ఎదుగుదలలో, వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర, ప్రోత్సాహం ఎంతో ముఖ్యం. కన్నబిడ్డల కోసం కంటికి రెప్పలా కాపాడుకుంటూ, తమ రెక్కలు ముక్కలు చేసుకొని శ్రమించేవారే అమ్మానాన్నలు. అయితే, ఇటీవల కాలంలో కొందరు తల్లిదండ్రులు తమ పసిబిడ్డల భవిష్యత్తు గురించి ఇసుమంతైనా ఆలోచించకుండా క్షణికావేశంలో తీసుకుంటున్న ఆకస్మిక నిర్ణయాలతో హఠాత్తుగా జీవితాలను ముగించేస్తున్నారు. ఈ బలవన్మరణాల కారణంగా ఎన్నో కుటుంబాలు నిలువునా ఛిన్నాభిన్నం అవుతుండగా, కన్నవారి నీడను కోల్పోయి ఎందరో చిన్నారులు అనాథలుగా మారుతున్నారు.

సెల్ఫీ వీడియోతో డ్రైవర్‌ ఆత్మహత్య

ప్రొద్దుటూరులో ఇటీవల ఓ డ్రైవర్‌ భార్యాభర్తల మధ్య ఉన్న గొడవల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. క్షణికావేశంలో తన ఆవేదననంతా సెల్ఫీ వీడియోగా రికార్డ్‌ చేసి, ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తండ్రి తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల ఆయనకున్న ఒకే ఒక్క కుమార్తె భవిష్యత్తు ఇప్పుడు పూర్తిగా ప్రశ్నార్థకంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చేనేత కార్మికురాలి యాసిడ్‌ మరణం

అప్పుల బాధ తాళలేక ప్రొద్దుటూరులో మరో చేనేత కార్మికురాలు దారుణ స్థితిలో తనువు చాలించింది. అప్పు ఇచ్చిన వారు తీర్చాలంటూ నిరంతరం మానసిక ఒత్తిడికి గురిచేయడంతో, తట్టుకోలేక ఆమె యాసిడ్‌ తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ఆమెకున్న ఇద్దరు పిల్లలు తల్లి లేని అనాథలుగా మారి రోడ్డున పడ్డారు.

సోషల్‌ మీడియా మాయ..

ఆర్థిక క్రమశిక్షణ లోపం:

ప్రస్తుత సమాజంలో ఆత్మహత్యలు పెరగడానికి సోషల్‌ మీడియా ప్రభావం ఒక ప్రధాన కారణంగా మారుతోందని విశ్లేషణలు చెప్తున్నాయి. స్మార్ట్‌ఫోన్లలో నిరంతరం రీల్స్‌, యూట్యూబ్‌ వీడియోలు చూడటం వల్ల తెలియని కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతున్నాయి. ఇవి కొందరి ఆలోచనా విధానాలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. పక్కవారితో అనవసరమైన ఆర్థిక పోటీలు పెట్టుకోవడం, కుటుంబాలలో ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, భార్యాభర్తలు ఒకరిపై ఒకరు అనుమానాలు పెంచుకోవడం వంటివి సంసారాలలో చిచ్చులు పెడుతున్నాయి. ఫలితంగా భర్తలపై ఉన్న కోపంతో, ఇంట్లో పసిపిల్లలు ఉన్నారనే కనీస బాధ్యతను కూడా మరచి కొందరు మహిళలు అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు.

చిన్న చిన్న కారణాలకే తల్లిదండ్రుల బలవన్మరణాలు

ఛిన్నాభిన్నమవుతున్న కుటుంబాలు

పసివాళ్ల భవిష్యత్తును గాలికి వదిలేస్తున్న వైనం.. జిల్లాలోపెరుగుతున్న ఆత్మహత్యల ఘటనలు

అమ్మానాన్నలు దూరమై అనాథలుగా మారుతున్న చిన్నారులు

ఖాళీగా ఉండకండి.. ఏదో ఒక పనిపై దృష్టి పెట్టండి!

‘ప్రస్తుత రోజుల్లో మనుషులలో సహనం నశిస్తోంది. ముఖ్యంగా మహిళలు ఇళ్లలో కరెంట్‌ డిజిటల్‌ పరికరాల ప్రభావంతో ఖాళీగా ఉండటం వల్ల అనవసరమైన ఆలోచనలు, మానసిక ఒత్తిళ్లు తలెత్తుతున్నాయి. మహిళలు ఇంట్లో ఒంటరిగా, ఖాళీగా ఉండకుండా తమకు నచ్చిన ఏదో ఒక పని లేదా ఉపాధి మార్గంపై దృష్టి సారించాలి.జీవితంలో సమస్యలు సహజం, అంత మాత్రానికే ఆత్మహత్యలు శరణ్యం కాదు. పసిపిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కౌన్సిలింగ్‌ కేంద్రాలను ఆశ్రయించాలి.

–డాక్టర్‌ కవితా ప్రసన్న,

మానసిక వైద్యనిపుణురాలు, జిల్లా ఆస్పత్రి

ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా జిల్లాలోనూ చిన్న చిన్న కారణాలకే, తాత్కాలిక సమస్యలకే బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ప్రసార మాధ్యమాల్లోనూ, పత్రికల్లోనూ గుండెలు పగిలే ఆత్మహత్యల వార్తలు వినాల్సి వస్తోంది. ఇటీవల కడప జిల్లాతో పాటు ప్రొద్దుటూరు పట్టణ పరిధిలో చోటు చేసుకున్న ఆత్మహత్య ఘటనలు ఇందుకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు వంటి సమస్యలకు ఆత్మహత్యే పరిష్కారం అనుకుంటూ చనిపోతున్న వారు.. తమ వెనుక ఉన్న పసిపిల్లల ఆక్రందనలను విస్మరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement