ఇకపై ప్రీ–పెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు | - | Sakshi
Sakshi News home page

ఇకపై ప్రీ–పెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు

May 16 2026 1:27 AM | Updated on May 16 2026 1:27 AM

కడప కార్పొరేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌(ఏపీఎస్‌పీడీసీఎల్‌) పరిధిలో ఉన్న ప్రభుత్వ విద్యుత్‌ సర్వీసులకు ప్రీ పెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు అమర్చాలని ఆ సంస్థ నిర్ణయించింది. జూన్‌ 1వ తేది నుంచి వీటిని అమల్లోకి తేవాలని చూస్తోంది. అంటే మొబైల్‌కు రీచార్జి ఎలా చేసుకుంటామో గడువు తీరిన తర్వాత విద్యుత్‌కు కూడా అలాగే రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. గృహాలకు ఏర్పాటు చేసే ముందు ప్రభుత్వ సర్వీసులకు అమర్చి ఫలితాలు చూడాలని ఏపీఎస్‌పీడీసీఎల్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.మెరుగైన నిరంతరాయ విద్యుత్‌ను అందించడంలో భాగంగా మొదట ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్‌ వర్క్స్‌, వీధి దీపా లు తదితర సర్వీసులకు ఇప్పటికే స్మార్టు మీటర్లు అమర్చారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ విద్యుత్‌ సర్వీసుల విద్యుత్‌ వినియోగం,బిల్లింగ్‌లో పారదర్శకతను పెంపొందించేందుకు వీలుగా స్మార్ట్‌ మీటర్లను కాస్తా ప్రీ–పెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లుగా మార్చాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రభుత్వ విద్యుత్‌ సర్వీసుల బకాయిల ఉపశమనంతోపాటు విద్యుత్‌ పంపిణీ సంస్థలు విద్యుత్‌ కొనుగోలు సామర్థ్యంపై ఒత్తిడిని అధిగమించేందుకు ఉపయోగపడుతుంది. సంస్థ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు/మున్సిపాలిటీలు, వాటర్‌ వర్క్స్‌, వీధి దీపాలు తదితర సర్వీసులకు సంబంధించి వైఎస్సార్‌ కడప జిల్లాలో 16,261 కనెక్షన్లు ఉన్నాయి. ఏపీఎస్‌పీడీసీఎల్‌ పరిధిలోని అన్ని జిల్లాలలో 1.17 లక్షల సర్వీసుల్లో సింగిల్‌ ఫేజ్‌ సర్వీసులు 91,306, త్రీఫేజ్‌ సర్వీసులు 26,507 వున్నాయి. ఈ సర్వీసులన్నింటినీ కొన్ని గ్రూపులుగా ఏర్పాటు చేసి, ఈ–వాలెట్‌ ద్వారా రీచార్జ్‌ చేసుకునే సౌకర్యాన్ని కల్పించడం జరుగుతోంది.

తొలుత ప్రభుత్వ విద్యుత్‌ సర్వీసులకు!

జూన్‌ 1 నుంచి అమలులోకి

జిల్లాలో 16,261ల ప్రీ–పెయిడ్‌ మీటర్లు

జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకే....

వినియోగదారుల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకే ప్రీ పెయిడ్‌/ స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేస్తున్నాం. సంస్థ పరిధిలోని 9 జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, మున్సిపాలిటీలు/కార్పొరేషన్లు, వాటర్‌ వర్క్స్‌ విద్యుత్‌ సర్వీసుల నుంచి రూ.9,507 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఈ బకాయిల చెల్లింపు, భవిష్యత్తులో విద్యుత్తు వినియోగంలో పారదర్శకతను పెంపొందించడం, విద్యుత్‌ బిల్లును ఆదా చేయడంతోపాటు విద్యు త్‌ వినియోగాన్ని నియంత్రించుకునేందుకు ప్రీ–పెయిడ్‌ మీటర్లు ఉపయోగపడుతాయి.

– శివశంకర్‌ లోతేటి, సీఎండీ, ఏపీఎస్‌పీడీసీఎల్‌

Advertisement
 
Advertisement
Advertisement