కడప వైఎస్‌ఆర్ సర్కిల్: శాప్ డైరెక్టర్ రజిని శనివారం కడపకు రానున్నట్లు డీఎస్‌డీఓ గౌస్‌బాషా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో జరిగే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను పరిశీలించేందుకు వస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రమైన కడపతో పాటు పలు ప్రాంతాల్లో జరిగే క్రీడా శిక్షణ శిబిరాలను పరిశీలిస్తారని పేర్కొన్నారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: శాప్ లీగ్ ఆధ్వర్యంలో ఈ నెల 20,21న వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్ క్రీడాంశాలలో జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు డీఎస్‌డీఓ గౌస్‌బాషా తెలిపారు. ఈ నెల 20న డీఎస్‌ఏ క్రీడా మైదానంలో యూత్–17, జూనియర్ విభాగంలో అండర్–20 బాలబాలికలకు వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. 21న అఽథ్లెటిక్స్ ఎంపికలు జూనియర్ విభాగంలో అండర్–16, అండర్–20 విభాగాల్లో ఉంటాయని తెలిపారు. క్రీడాకారులు తమ పేర్లను శాప్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.
పుంగనూరు: టమాటా పండించిన రైతులకు ధరలు ఊరటనిస్తున్నాయి. 10 కిలోల టమోట రూ.300లు కాగా, మూడో రకం రూ.260లు పలికింది. మార్కెట్ కమిటీకి 84 మెట్రిక్ టన్నుల టమాటాను రైతులు తరలించారు. టమాటాను చైన్నె, విజయవాడ, హైదరాబాద్‌కు వ్యాపారులు తరలించారు. రైతులు గిట్టుబాటు ధర లభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలు ఇలాగే కొనసాగితే అప్పుల ఊబిలో నుంచి బయట పడుతా మని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కడప కోటిరెడ్డి సర్కిల్: చర్లపల్లె – తిరుచానూరు మధ్య వారాంతపు రెగ్యులర్ రైలును ఈనెల 17వ తేదీ నుంచి నడపనున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. ప్రతి ఆదివారం చర్లపల్లెలో (17059) రాత్రి 9.30గంటలకు బయలుదేరి మల్కాజ్‌గిరి, కాచిగూడ, షాద్ నగర్, మహబూబ్ నగర్, కర్నూలు, తాడిపత్రి, కడప, రేణిగుంట మీదుగా తిరుచానూరుకు మరుసటి రోజు మధ్యాహ్నం 12.30గంటలకు చేరుకుంటుందని వివరించారు. ప్రతి సోమవారం (17060) తిరుచానూరులో సాయంత్రం 4గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8గంటలకు ఇదే మార్గంలో చర్లపల్లెకు చేరుకుంటుందన్నారు. ఈ రైలుకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


