ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన కేసులో టీడీపీ ప్రొద్దుటూరు మాజీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అనుచరుడు పైడాల మహేష్‌ను వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని మాజీ కౌన్సిలర్ తలారి పుల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రవీణ్ వర్గీయులైన పైడాల మహేష్, అజయ్‌కుమార్‌లపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో శుక్రవారం మహేష్‌ను అరెస్ట్ చేసినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.
క్రికెట్ బెట్టింగ్ జూదరులు అరెస్టు
మైదుకూరు : క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ఇద్దరు జూదరులను శుక్రవారం మైదుకూరు పోలీసులు అరెస్టు చేశారు. మైదుకూరుకు చెందిన సింగనమల నాగరాజు, ఇందిరమ్మ కాలనీకి చెందిన రాయలగొల్ల రాజు అనే వారు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా స్థానిక వనిపెంట రోడ్డులోని జగన్ డాబా సమీపంలో అర్బన్ ఎస్‌ఐలు చిరంజీవి, వెంకరటమణ ఆధ్వర్యంలో దాడి చేశారు. నాగరాజు వద్ద రూ.3,500, రాజు వద్ద రూ.4,500 నగదును స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు.
రాజుపాళెం : మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వెల్లాల శ్రీచెన్నకేశవ, సంజీవరాయ, భీమలింగేశ్వర స్వాముల ఆలయాలకు సంబంధించి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర దేవాదాయ ఖాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ ఆలయాలకు సంబంధించి ధర్మకర్త మండలి సభ్యులుగా లక్ష్మినారాయణ రెడ్డి, లక్ష్మి నరసింహా రెడ్డి, మధుసూదర్‌రెడ్డి, దాసరి రామారావు, శంకుసాయి రామారావు, విజయలక్ష్మి, సావిత్రి, అచ్చమ్మ, ఇమాంబి, వెంకటసుబ్బమ్మ, కృష్ణవేణి, ఎక్స్ అఫిషియో మెంబర్‌గా వీణా శేషాచార్యులను నియమించారు. మొత్తం 12 మంది ధర్మకర్తలి మండలి సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం రోజున ట్రస్ట్ బోర్డు చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు.
ప్రొద్దుటూరు కల్చరల్ : కర్నూలులోని పోస్ట్‌మాస్టర్ జనరల్ కార్యాలయంలో ఈ నెల 25న డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తపాలా సూపరింటెండెంట్ కిరణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలకు పోస్టల్ శాఖకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే దీనిలో పాల్గొని ఉన్నతాధికారులదృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని తెలిపారు.
మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పాతపాలెం గ్రామంలో అమ్మమ్మగారింటికి వచ్చిన దండుబోయిన వర్ధన్‌కుమార్ అనే 15 ఏళ్ల బాలుడు అదృశ్యమైనట్టు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి తెలిపారు. ఖాజీపేట మండలం త్రిపురవరం గ్రామానికి చెందిన ఈ బాలుడు వేసవి సెలవుల్లో అమ్మమ్మగారింటికి వచ్చాడని, గురువారం ఉదయం 11 గంటలకు ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని పేర్కొన్నారు. తల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి గాలిస్తున్నట్టు సీఐ వివరించారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు అర్బన్ సీఐ 9121100618, ఎస్‌ఐ 9121100619 నంబర్లకు తెలియజేయాలని కోరారు.
కడప కోటిరెడ్డి సర్కిల్ : కడప నగరంలోని స్థానిక నాగరాజు పేటలో అమ్మాయి తప్పిపోయిందని ఐసీడీఎస్ పీడీ పి.రమాదేవి తెలిపారు. శుక్రవారం ఆమె తెలుపుతూ కడప వన్ టౌన్ పోలీసులు ఆ పాపను జిల్లా బాలల సంక్షేమ సమితిలో హాజరు పరచగా, ఆ పాపను ప్రత్యేక దత్తత సంస్థలో ఆశ్రయం కల్పించామన్నారు. ఆ పాప తల్లిదండ్రులు గానీ, బంధువులు కానీ తగిన ఆధారాలతో బాలల సంక్షేమ సమితి కార్యాలయానికి చేరుకుని సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 8919171503 అనే నెంబర్‌కు సంప్రదించాలన్నారు.
ప్రొద్దుటూరు కల్చరల్ : హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాయలసీమ వర్కింగ్ కమిటీ చైర్మన్‌గా డాక్టర్ అరికొండ ప్రతాప్‌కుమార్‌ను సంస్థ జాతీయ చైర్మన్ తాల్లూరి ప్రసన్న కుమార్ నియమించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌కుమార్ మాట్లాడుతూ ప్రొద్దుటూరు నియోజకవర్గ చైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్న తనకు రాయలసీమ వర్కింగ్ కమిటీ చైర్మన్‌గా పదోన్నతి కల్పించడం ఆనందంగా ఉందన్నారు.
ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కోవాలి
కడప అగ్రికల్చర్: జిల్లాలో ప్రస్తుత ఎన్‌నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని ప్రకృతి వ్యవసాయ సేద్యం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. వైఎస్సార్ కడపజిల్లా రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో కడపలోని జిల్లా డీపీఎం కార్యాలయంలో జిల్లా స్థాయిలో బయో రిసోర్సు సెంటర్ యజమానులకు మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ఎల్‌నినో ప్రభావం దాని వల్ల వ్యవసాయంపై కలిగే మార్పులు వాటిని తట్టుకునే పద్ధతులపై వివరించారు. అదనపు ప్రాజెక్టు మేనేజర్ వసంతకుమారి, బయో రిసోర్సు సెంటర్ యజమానులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.


