అయ్యా... ఇదెక్కడి న్యాయం..? | - | Sakshi
Sakshi News home page

అయ్యా... ఇదెక్కడి న్యాయం..?

May 16 2026 1:27 AM | Updated on May 16 2026 1:27 AM

తూ తూ మంత్రంగా ఎన్‌హెచ్‌ అధికారుల విచారణ

అర్హులైన రైతులను

పిలవకుండానే విచారణ

స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వచ్చినా కూడా రైతులకు అన్యాయం

విందు భోజనాలతో

సరిపెట్టుకున్న విచారణ

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : కడప – ముద్దనూరు, బి.కొత్తపల్లె నేషనల్‌ హైవే ఎన్‌హెచ్‌ 716 రహదారి పరిహారం విచారణను ఎన్‌హెచ్‌ అధికారులు తూ తూ మంత్రంగా చేపట్టారు. శుక్రవారం సాక్షిలో ‘కోల్పోయింది కొంత.. కొట్టేసింది కొండంత’ అనే శీర్షికన వార్త ప్రచురితం కావడంతో జిల్లా స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వెంకటపతిని జిల్లా ఉన్నతాధికారులు విచారణాధికారిగా నియమించారు. దీంతో శుక్రవారం ఆయన తొండూరు మండలంలోని మల్లేల, తొండూరు, ఇనగలూరు, సైదాపురం, క్రిష్ణంగారిపల్లె తదితర గ్రామాలకు సంబంధించిన రైతులకు ఎవరైతే పైపులైన్లు కానీ, పండ్ల తోటలు కానీ, బోరు బావులు నష్టపోయారో అలాంటి రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా కొంతమంది అనుకూలమైన రైతులను మాత్రమే పిలిపించుకుని విచారణ జరిపినట్లు పలువురు రైతులు వాపోతున్నారు.

అర్హులైన రైతుల ఆవేదన ..

మల్లేల గ్రామంలోని గుజ్జుల మల్లికార్జున, బూ చుపాటి దాసి, బూచుపాటి సుధాకర్‌, శ్రీరామరత్నం, ఓబులేసు, శ్రీరాములు, నాగయ్య, గోపాల్‌రెడ్డి, వెంకటరమణ, నాగేశ్వరరెడ్డిలతోపాటు మరికొంతమంది రైతులు 2014–15 సంవత్సరంలో చీనీ పంటలకు నీటి తడులు అందించేందుకు బోరుబావులలో నీరు లేకపోవడంతో సమీపంలో ఉన్న మల్లేల చెరువు నుంచి దాదాపు కిలోమీటర్ల మేర లక్షలాది రూపాయలు వెచ్చించి పైపులైన్లు వేసుకున్నారు. అప్పటినుంచి తమ చీనీ పంటలకు నీటి తడులు అందిస్తున్నారు. అలాంటి తరుణంలో ఎన్‌హెచ్‌ హైవేలో భాగంగా తమ పైపులైన్లు పూర్తిగా ధ్వంసమైనప్పటికి అధికారులు తమకు పరిహారం అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు.

స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వచ్చినా

రైతులకు అన్యాయం..

ఎన్‌హెచ్‌ 716 హైవే రహదారికి తొండూరు మండలంలోని మల్లేల, తొండూరు, ఇనగలూరు, క్రిష్ణంగారిపల్లె తదితర గ్రామాలకు సంబంధించిన రైతులు పైపులైన్లు, బోరుబావులు నష్టపోయినా అధికారులు వారికి అన్యాయం చేశారు. శుక్రవారం జిల్లా స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వెంకటపతి వచ్చి అర్హులై నష్టపోయిన రైతులను విచారణ జరపకుండా కొంతమంది రైతులను మొక్కుబడిగా పిలిపించుకుని విచారణ చేపట్టి మమ అనిపించుకున్నారు. అధికారులు వచ్చారని రైతులు అక్కడికి వెళ్లి మాకు న్యాయం చేయాలని అడిగినా కూడా మేం హైవే రోడ్డు పనులు చూడటానికి వచ్చామని రైతులతో అన్నట్లు పలువురు వాపోతున్నారు. విచారణ అనంతరం తొండూరు తహసీల్దార్‌ కార్యాలయంలో విచారణకు వచ్చిన అధికారులు విందు భోజనాలు ఏర్పాటు చేసుకుని విచారణ ముగించుకుని వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై ఎన్‌హెచ్‌ ఏఈ విశ్వనాథరెడ్డిని సాక్షి వివరణ కోరగా.. విచారణ పూర్తి చేశామని, అర్హులైన రైతులెవరైనా ఉంటే తొండూరు తహసీల్దార్‌ కార్యాలయంలో అర్జీల ద్వారా తెలియజేయాలన్నారు.

తొండూరులో తూ తూ మంత్రంగా విచారణ జరుపుతున్న ఎన్‌హెచ్‌ అధికారులు, మల్లేలలో విచారణ జరుపుతున్న ఎన్‌హెచ్‌ అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement