సింహాద్రిపురం : సింహాద్రిపురం మండలంలోని బి.చెర్లోపల్లె గ్రామంలో అప్పుల బాధ తాళలేక కౌలు రైతు విషపు గుళికలు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన అంకె రామచంద్రుడు (55) అనే కౌలు రైతు కూలీ పనులకు వెళ్తూ గ్రామ సమీపంలోని బిదినంచర్ల గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన 7ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని గత ఏడాది అప్పులు తెచ్చి అరటి సాగు చేశాడు. అయితే అరటిలో దిగుబడులు బాగా రాగా.. గాలి రూపంలో కౌలు రైతు ఆశలు అడియాశలయ్యాయి. ధైర్యం కోల్పోకుండా ఈ ఏడాది కూడా మళ్లీ అప్పులు చేసి అరటిని సాగు చేశాడు. అయితే ఈ ఏడాది కూడా దిగుబడి ఉన్న అరటి ధర పతనం కావడంతో విధి లేని పరిస్థితుల్లో టన్ను అరటిని రూ.2వేల నుంచి రూ.3వేలకు విక్రయించాడు. అరటి సాగుకు పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంతోపాటు అప్పులు పెరిగిపోయి దాదాపు రూ.20లక్షల దాకా అప్పు ఉండటంతో రైతు చేసేదేమి లేక దిక్కుతోచని స్థితిలో గురువారం రాత్రి విష గుళికలు తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుమారులు తండ్రిని పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు ధ్రువీకరించారు. మృతుడి కుమారుడు జలంధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


